హైదరాబాద్:తమ జిల్లాలోనే ఎక్కువ కాలం ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. ఈ నెల 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులకు పలు విషయాలపై భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపై స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది.

సుమారు ఏడు గంటల పాటు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు విషయాలపై సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చించారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఆయా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొంటూ వెళ్లాలని సీఎం సూచించారు.

ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలతో కూడ సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ కేబినెట్ సమావేశంలో సూచించారని తెలుస్తోంది.జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చించాలని  కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది.

తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సరిగా స్పందించలేదని సీఎం అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తమ శాఖలపై మంత్రులు పట్టు పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. అంతేకాదు ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించడం ద్వారా ఇంకా మెరుగైన ఫలితాలను ఎలా సాధించవచ్చనే విషయమై ఆలోచించాలని సీఎం కేసీఆర్ మంత్రులను కోరారు.