ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఆయనో అవినీతి తిమంగళమని.. మంత్రిగా వున్నప్పుడు ఆస్తుల్ని సంపాదించారని, ఆయన పనుల గురించి తన దగ్గర పుస్తకమే వుందన్నారు రాజయ్య.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అధిష్టానానికి తలనొప్పులు తెస్తున్నారు. తాజాగా ఆదివారం హిమ్మత్ నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాజయ్య.. శ్రీహరిని టార్గెట్ చేశారు. నియోజకవర్గంలో ఎక్కడిపడితే అక్కడ ఆరుద్ర పురుగులాగా కడియం శ్రీహరి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కాకముందు ఆయన ఇంటి కిటికీలకు గోనె సంచులు కట్టుకునేవాడని.. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని రాజయ్య ప్రశ్నించారు. కడియం శ్రీహరి అవినీతి తిమంగళమని.. మంత్రిగా వున్నప్పుడు ఆయన చేశారో తన దగ్గర ఒక పుస్తకమే వుందని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు పుస్తకం బయటపెడతానని.. శ్రీహరి ఆస్తులు ఎక్కడెక్కడ వున్నాయో బయటకు తీస్తానని రాజయ్య హెచ్చరించారు.
శ్రీహరి మంత్రిగా వున్నప్పుడు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని తాకట్టుపెట్టి సింగపూర్, మలేషియాలలో ఆస్తులు కొన్నారని ఆరోపించారు. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్న చరిత్ర తనదని రాజయ్య అన్నారు. నియోజకవర్గంలో దొంగచాటుగా మీటింగ్‌లు పెడుతున్నారని, నిజంగా బీఆర్ఎస్ నేతవైతే రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టాలని కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారు, అసంతృప్తులు మాత్రమే కడియం వెంట వుంటున్నారని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్‌ను మించిన జగమొండినని.. 20 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా వుంటూ, ఆస్తులు పెంచుకుంటున్నారని శ్రీహరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజయ్య.
ALso Read: మంత్రిగా వున్నప్పుడల్లా ఎన్‌కౌంటర్లు.. పార్టీలోంచి బహిష్కరించండి : కడియంపై రాజయ్య వ్యాఖ్యలు
అంతకుముందు శుక్రవారం వారం కూడా కడియం శ్రీహరిపై విమర్శలు చేశారు తాటికొండ రాజయ్య. దేవాదుల సృష్టికర్త కడియం కాదని , ఆయన ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అని ఆరోపించారు. కడియంను తక్షణం పార్టీలోంచి సస్పెండ్ చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. ఎంపీలుగానీ, ఎమ్మెల్సీలు గానీ.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే నియోజకవర్గంలోకి అడుగుపెట్టాలన్నారు. కానీ కడియం శ్రీహరి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజయ్య మండిపడ్డారు.
2018 ఎన్నికల సమయంలో తాను ఆస్తులు మొత్తం అమ్ముకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కడియం శ్రీహరి ఆస్తులు పెరిగాయని రాజయ్య ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ ఏర్పడ్డాక కడియం మంత్రిగా వున్న సమయంలో ఎన్‌కౌంటర్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు. మంత్రిగా వుండి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని రాజయ్య దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రజలు తన వెంటే వున్నారని.. దళితులను కంటికి రెప్పలా కాపాడతానని రాజయ్య వెల్లడించారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
