తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే పార్టీలన్ని ఓటర్లను ప్రసన్నం చేపుకునే పనిలో పడ్డాయి. అయితే ఈ క్రమంలో పలు గ్రామాల్లో ఓటర్లు ఫలానా పార్టీకే ఓటేయాలని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. ఓటర్లు స్వతహాగా ఈ నిర్ణయం తీసుకుంటే పరవాలేదు... కానీ ఇందుకోసం వీరిపై ఏ పార్టీ అయినా, నాయకుడైనా ఒత్తిడి తెచ్చినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులేవీ తమకు అందలేదని...అందితే విచారణకు ఆదేశిస్తామని అన్నారు.

ఇక ముందస్తు ఎన్నికల తేదీలపై జరుగుతున్న ప్రచారాలను ఆయన కొట్టిపారేశారు. ఎన్నికల నిర్వహణ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం నుండి తమకెలాంటి సమాచారం అందలేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. తేదీ ఖరారయ్యాక మొదట తమకే సమాచారం అందుతుందని ఆయన తెలిపారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించడానికి సిద్దంగా ఉన్నట్లు రజత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతంగా కొనసాగించడంతో పాటు అధికారులకు వీవీపాట్ లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ బూతుల్లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రజత్ కుమార్  స్పష్టం చేశారు.