హైదరాబాద్  జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో తెరమీదికి కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. దీంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ మరింత పెరుగుతోంది. జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలి ప్రమాణస్వీకారానికి సమయం సమీపిస్తోంది. ఫిబ్రవరి 11న కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో టీఆర్ఎస్ కార్పొరేటర్లలో మేయర్, డిప్యూటీ మేయర్ కుర్చీల కోసం రేసు ఊపందుకుంది. కాగా మేయర్ సీటును ఈ సారి జనరల్ మహిళకు కేటాయించారు. 

ఈ నేపథ్యంలో మొదట జీహెచ్ఎంసీ ఫలితాలు రాగానే మేయర్ రేసులో భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి పేరు వినిపించింది. అయితే ప్రస్తుతం ఆమె మేయర్ రేసు నుంచి వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది. 

దీనికి తోడు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మేయర్ కాబోతున్నారని సోషల్ మీడియాలో ఆమె అనుచరులు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి తండ్రి కేశవరావు ద్వారా మేయర్ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

ఇక బంజారాహిల్స్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి కూడా ఇటీవల కేటీఆర్ ను కలిశారు. మేయర్ గా తనకు అవకాశం ఇవ్వాలని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో మేయర్ పదవి రేసు హాట్ హాట్ గా మారింది. చివరికి ఎవరు ఆ పీఠం ఎక్కబోతున్నారన్న దాని మీద సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. 

ఇక డిప్యూటీ మేయర్ పదవి కోసం కూడా చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ప్రసుత్తం ఇప్పటివరకు డిప్యూటీ మేయర్ గా ఉన్న బాబానే మళ్లీ కొనసాగిస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. మరోవైపు కొత్తగా మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

అల్లాపూర్ కార్పొరేటర్ గా గెలిచిన సహిబా బేగం మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీనికోసం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పైరవీ చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

ఇంకోవైపు హోంమంత్రి మహ్మాద్ అలీతోపాటు మరికొందరు మైనారిటీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే అధిస్థానం కూడా సహిబాకు అవకాశం ఇచ్చేలా ఉందని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.