హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడ ఆహ్వానం అందింది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు  రాష్ట్రపతి నుండి విందు ఆహ్వానం అందింది. ఇందులో కేసీఆర్ కు చోటు దక్కింది.

రాజకీయంగా స్థిరత్వం, పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్న రాష్ట్రాలకు అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.ఈ క్రమంలోనే కోవింద్ ఇచ్చే విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అవకాశం దక్కిందనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయాల్లో కూడ అమెరికా అధ్యక్షులు పర్యటించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిల్ క్లింటన్ ను ఏపీ రాష్ట్రానికి రప్పించేందుకు పలు ఏజెన్సీలతో తీవ్రంగా కృషి చేసి విజయం సాధించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశ పర్యటనకు వచ్చిన  బుష్  హైద్రాబాద్ లో కూడ పర్యటించారు. ఆ సమయంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. బుష్ తో కలిసి అప్పటి సీఎం వైఎస్ హెలికాప్టర్ లో పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడికి ఉన్న అవకాశాల గురించి బుష్ కు ఆయన వివరించారు.

దేశంలోని బీజేపీ, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ట్రంప్ తో విందులో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది. హైద్రాబాద్ లో పెట్టుబడికి ఉన్న అవకాశాలు ఇతరత్రా అంశాలను ఆధారంగా చేసుకొని తెలంగాణను ఈ విందుకు కేసీఆర్ ను ఆహ్వానించినట్టుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రపంచ బ్యాంకు ఆర్ధిక విధానాలను అమలు చేశాడు. థావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వివరించేవారు. ఈ కారణంగానే పలు కంపెనీలు హైద్రాబాద్ లో ఏర్పాటయ్యాయి.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబునాయుడు ఉన్నారు. దీంతో ఏపీ రాష్ట్రంలో ఆ సమయంలో క్లింటన్ పర్యటనకు మార్గం సుగమమైందని అప్పట్లో ప్రచారం ఉండేది.

also read:ట్రంప్ భారత పర్యటన: షెడ్యూల్ ఇదే..!

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇండియా పర్యటనకు వస్తున్న బుష్ ను హైద్రాబాద్ లో పర్యటించాలని వైఎస్ కోరారు. 

ఈ మేరకు కేంద్రాన్ని కూడ కోరారు. హైద్రాబాద్ లో బుష్ పర్యటించారు. బుష్ పర్యటన హైద్రాబాద్ లో సాగిన సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయనతో కలిసి హెలికాప్టర్ లో ప్రయాణం చేసే సమయంలో వైఎస్ వివరించారు.

ఏపీ రాష్ట్రంలో క్లింటన్ పర్యటనను చంద్రబాబునాయుడు పదే పదే ప్రస్తావించేవారు. వైఎస్ మాత్రం బుష్ పర్యటన గురించి అంతగా పట్టించుకోలేదని కాంగ్రెస్ వర్గీయులు గుర్తు చేసుకొంటున్నారు.