తనను నమ్మిన యజమానికి నమ్మక ద్రోహం చేశాడో కారు డ్రైవర్. కారును, నగదును ఎత్తుకెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే..  శ్రీశైలంలోని విశ్వనాథ పీఠాధిపతి విశ్వనాథ్ స్వామిజీ తన కారులో శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్‌పై ఘట్‌కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో శామీర్‌పేట వద్దకు రాగానే స్వామిజీ మూత్ర విసర్జన కోసం కారు దిగా.. ఇదే అదనుగా భావించిన కారు డ్రైవర్ కిరణ్ కారుతో పాటు రూ. 40 వేల రూపాయలతో ఉడాయించాడు.

వెంటనే తేరుకున్న స్వామిజీ శామీర్‌పేట పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పటాన్‌చెరు టోల్‌గేట్‌ సమీపంలో కారును గుర్తించారు. పోలీసులను చూసిన డ్రైవర్ కిరణ్ కారును వదిలి పారిపోయాడు. అనంతరం స్వామిజీకి పోలీసులు కారును అప్పగించారు. కిరణ్‌పై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.