వొదల బొమ్మాలీ... అన్నది తెలుగు సినిమాలోని పాపులర్ డైలాగ్. ప్రస్తుతం తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ ను సినీ నటి శ్రీరెడ్డి వదల బొమ్మాలీ అన్నట్లు వెంట పడుతున్నది. ఎందుకు శ్రీరెడ్డి కేటిఆర్ వెంట పడుతున్నారంటే?

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ మీద చర్యలు తీసుకోవాలంటూ శ్రీరెడ్డి గత కొంతకాలంగా పోరుబాట పట్టారు. ఆమె పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే ఒక దశలో ఆమె ఫిల్మ్ ఛాంబర్ వద్ద బట్టలు విప్పి నిరసన కూడా తెలిపారు. అయితే ఆమె ఆందోళన శృతిమించిన దాఖలాలున్నాయి. పవన్ కళ్యాణ్ మీద, ఆయన తల్లి మీద తీవ్రమైన తిట్లు తిట్టడంతో జనాల్లో శ్రీరెడ్డి పలుచనైపోయారు. తర్వాత పవన్ కు, ఆయన తల్లికి క్షమాపణలు చెప్పారు.

ఇక ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ మీద చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటిఆర్ ను శ్రీరెడ్డి కోరుతున్నారు. ట్విట్టర్ లో ఇలా పోస్టు పెట్టగానే అలా స్పందిస్తారన్న పేరుంది కేటిఆర్ కు. దీంతో శ్రీరెడ్డి కూడా ట్విట్టర్ ను వేదికగా చేసుకుని కేటిఆర్ కు ట్విట్ పెట్టారు. కానీ కేటిఆర్ స్పందించలేదు. అయినా శ్రీరెడ్డి ఊరుకోలేదు. మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతూనే ఉన్నారు. కానీ కేటిఆర్ మాత్రం స్పందించలేదట. దీంతో శ్రీరెడ్డి తన ట్విట్టర్ పోస్టులను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. మూడు, నాలుగు సార్లు కేటిఆర్ కు ట్విట్ పెట్టినా స్పందించడంలేదని తెలిపారు.

తన పోస్టుకు స్పందించని కేటిఆర్ మూవీలకు మాత్రం దగ్గరుండి ప్రచారం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను బయటపెడుతున్నా సినీ పెద్దలు పట్టించుకోవడం లేదని, అందుకే ఇండస్ట్రీలో తమపై వేధింపులపై నేరుగా కలుసుకుని చర్చించాలని భావిస్తున్నట్లు శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. సినీ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాలు మా సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదని, వారి నిర్ణయాలపై మేం సంతృప్తి చెండడం లేదని శ్రీరెడ్డి ఆరోపించారు. తెలుగు మహిళలు, యువతులకు సినిమాలో ఆఫర్లు రావడం లేదన్నారు.

మొత్తానికి ఈ ఇష్యూపై కేటిఆర్ స్పందించేదాకా శ్రీరెడ్డి వదిలేలా లేదుగా అని తెలుగు సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.