Asianet News TeluguAsianet News Telugu

శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల ట్విస్ట్: ఆ విషయం గుర్తించి...

టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో హైదరాబాదు ఎస్సార్ నగర్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. తొలుత మూడో నిందితుడిగా ఉన్న దేవరాజు రెడ్డిని తాజాగా తొలి నిందితుడిగా చేర్చారు.

Sravani suicide case: Police give twist
Author
Hyderabad, First Published Sep 16, 2020, 10:19 AM IST

హైదరాబాద్: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. తొలుత మూడో నిందితుడిగా ఉన్న దేవరాజు రెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు తమ వద్ద రిమాండ్ రిపోర్టు ఉందంటూ ఓ ప్రముఖ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. 

తొలి నిందితుడిగా ఉన్న సాయికృష్ణా రెడ్డిని రెండో నిందితుడిగా, రెండో నిందితుడిగా ఉన్న సినీ నిర్మాత అశోక్ రెడ్డిని మూడో నిందితుడిగా చేర్చారు. దేవరాజు రెడ్డి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించి రిమాండ్ రిపోర్టులో మార్పు చేసినట్లు తెలుస్తోంది. దేవరాజు రెడ్డిని మూడో నిందితుడిగా చేర్చినట్లు మీడియా సమావేశంలో పోలీసాఫీసర్ శ్రీనివాస్ చెప్పారు. 

అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అశోక్ రెడ్డిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అది ఉండగా తొలుత ఈ విధంగా వార్తలు వచ్చాయి....టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తు్నారు. ఆయన ఫోన్ కాల్ డేటా ఆధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులోని ముగ్గురు నిందితుల్లో దేవరాజ్, సాయికృష్ణా రెడ్డిలను హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. 

సోమవారం పోలీసు స్టేషన్ కు వస్తానని చెప్పిన అశోక్ రెడ్డి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. సెల్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి శ్రావణితో ఆయన సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఆమె దేవరాజ్ కు దగ్గర కావడాన్ని అశోక్ రెడ్డి సహించలేకపోయాడని చెబుతున్నారు. దాంతో దేవరాజుతో శ్రావణి విడిపోయే విధంగా సాయికృష్ణ ద్వారా ఒత్తిడి పెట్టినట్లు తెలుస్తోంది. 

సెప్టెంబర్ 7వ తేదీన అమీర్ పేట హోటల్ వద్ద శ్రావణి, దేవరాజులతో గొడవ తర్వాత సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్ రెడ్డితో పాటు అందరూ కలిసి శ్రావణిని శారీరకంగా హింసించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన వ్యవహారాల్లో అశోక్ రెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

దాన్ని పసిగట్టిన దేవరాజ్, అశోక్ రెడ్డి తప్పించుకునేందుకు ప్రయత్నించారు దేవరాజు ఊరికి వెళ్లి పోలీసులనుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. తన పేరు తెర మీదికి రాగానే ఆశోక్ రెడ్డి సాయికృష్ణ ద్వారా దేవరాజ్ పేరును ముందు పెట్టారు. 

దేవరాజు తనను వేధిస్తున్నట్లు జూన్ 22వ తేదీన శ్రావణి ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాతి రోజు పోలీసు స్టేషన్ కు వెళ్లి దేవరాజ్ ను అరెస్టు చేయవద్దని, తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది. విషయం తెలిసి అశోక్ రెడ్డి సాయికృష్ణపై ఒత్తిడి పెంచారు. సాయికృష్ణ, అశోక్ రెడ్డి పెళ్లి చేసుకుంటామని హామీ ఇస్తూ తప్పించుకుంటున్న స్థితిలోనే శ్రావణి దేవరాజుకు దగ్గరైనట్లు సమాచారం. 

తొలుత ఆమెను ప్రేమిస్తున్నప్పటికీ వారిద్దరితో ఆమెకు శారీరక సంబంధం ఉందన తెలిసిన తర్వాత దేవరాజు ఆమెను దూరంగా పెట్టాలని అనుకున్నాడు. దేవరాజ్ నిజానికి టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. దేవరాజ్ చేతిలో అప్పటికే బిందు అనే యువతి మోసపోయినట్లు తెలుస్తోంది. దేవరాజు చేతిలో మోసపోవద్దంటూ బిందు సెల్ఫీ వీడియో ద్వారా శ్రావణిని హెచ్చిరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios