హైదరాబాద్: టీవీ సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు సోమవారం విచారణకు పిలువాలని అనుకున్నారు. ఆయితే, ఆయన అందుబాటులో లేకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆశోక్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసుల ఫోన్ కాల్స్ ను ఆయన అటెండ్ చేయడం లేదు. ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఫోన్ స్విఛాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రావణితో అశోక్ రెడ్డి మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి లీకైన విషయం తెలిసిందే. ఆయన దేవరాజు వ్యవహారంలో శ్రావణికి సలహాలు ఇచ్చినట్లు ఆ సంభాషణ బట్టి తెలుస్తోంది. 

కాగా, శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అదే సమయంలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వారిద్దరిని అరెస్టు చేసినట్లు ప్రకటించే అవకాశం ఉంది. శ్రావణి ఆత్మహత్యకు వారిద్దరు కారణమని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. 

గత కొద్ది రోజులుగా దేవరాజు రెడ్డిని విచారిస్తూ వచ్చిన హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు ఆదివారం సాయికృష్ణా రెడ్డిని, శ్రావణి కుటుంబ సభ్యులను విచారించారు. దేవరాజు రెడ్డి శ్రావణి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. దేవరాజ్, సాయి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. 

శ్రావణి దేవరాజు తల్లి సత్యవతితో మాట్లాడిన సంభాషణల ఆడియో లీకైంది. దేవరాజు నుంచి కీలకమైన సమాచారం రాబట్టి హైదరాబాదు ఎస్సార్ నగర్ పోలీసులు ఆదివారం శ్రావణి కుటుంబ సభ్యులను, సాయిని విచారించారు. ఈ క్రమంలో దేవరాజు తల్లి సత్యవతికి కాల్ చేసి మాట్లాడిని ఓ ఆడియో లీకైంది. 

దేవరాజు అంటే తనకు ఇష్టమని, అతనితో వివాహం జరిపించాలని శ్రావణి సత్యవతితో చెప్పింది. అయితే, కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోలీసు స్టేషన్ లో దేవరాజుపై పెట్టిన కేసు గురించి సత్యవతి ప్రశ్నించింది. ముందు ఆ కేసులు వెనక్కి తీసుకోవాలని సత్యవతి శ్రావణికి సూచించింది.

పెళ్లికి సరేనంటే తాను కేసును వెనక్కి తీసుకుంటానని శ్రావణి సత్యవతికి చెప్పింది. పోలీసుల విచారణలో ఈ ఆడియో కూడా కీలకమవుతుందని భావిస్తున్నారు. ఆదివారంనాడు సాయి, దేవరాజులను ఎదురెదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారంనాటి విచారణ కీలకం కానుంది. 

కేసు నుంచి తప్పించుకోవడానికి దేవరాజు మరోసారి శ్రావణిని బుట్టలో వేసుకున్నాడని సాయి చెబుతున్నాడు. సాయి వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని దేవరాజు ఆరోపిస్తున్నాడు. సోమవారంనాడు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. దాంతో ఈ కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.