Tirupati Special trains: తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్త. పెద్దపల్లి నుండి తిరుపతికి ప్రయాణం మరింత సులభం కానుంది. నాందేడ్ నుండి ధర్మవరం వరకు తిరుపతి మీదుగా కొత్త రైలును రైల్వే శాఖ ప్రారంభించనుంది.  

Tirupati Special trains: తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు తిరుపతికి వెళ్లే రైలు సౌకర్యం మరింత సులభం. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నప్పటికీ, వచ్చే నెల నుంచి మరో కొత్త రైలు ప్రారంభం కానుంది. దీంతో వారానికి ఆరు రైళ్లు అందుబాటులో ఉండగా, భక్తులు తిరుపతి చేరుకునే అవకాశం కలుగుతోంది. పెద్దపల్లి రైల్యే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో తిరుపతి ప్రయాణం మరింత సులభం అవుతోంది. ఆ వివరాలేంటో? వాటి టైమింగ్స్ ఏంటో ఓ లూక్కేయండి.

కొత్త రైలు సౌకర్యం:

ఉత్తర తెలంగాణ నుండి తిరుపతికి రైలు ప్రయాణం మరింత సులభం కానుంది. ఇప్పటికే కరీంనగర్-తిరుపతి వీక్లీ రైలు, మూడు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 5 నుంచి మరో కొత్త రైలు ప్రయోగాత్మకంగా ప్రారంభమవుతోంది. గత నెలలో నాందేడ్ నుంచి తిరుపతికి ప్రారంభించిన వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌కు మంచి ఆదరణ లభించినందున, రైల్వే శాఖ కొత్త రైలు ప్రారంభానికి షెడ్యూల్ విడుదల చేసింది. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ రైలుకు మంచి ఆదరణ వస్తే కొనసాగిస్తారు. ఇప్పటికే నడిచే కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ప్రతి గురువారం, ఆదివారం నడుస్తుంది. అలాగే, గత నెలలో ప్రారంభమైన నాందేడ్-తిరుపతి ప్రత్యేక రైలు ప్రతి శనివారం రాత్రి 10.05 గంటలకు అందుబాటులో ఉంటుంది.

స్పెషల్ ట్రైన్ షెడ్యూల్:

నాందేడ్-ధర్మవరం ప్రత్యేక రైలు: సెప్టెంబర్ 5 నుంచి నాందేడ్-ధర్మవరం ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం రాత్రి 10.05 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతోంది.

లాల్‌కౌన్ జంక్షన్-కేఎస్సార్ బెంగళూరు ప్రత్యేక రైలు: ప్రతి ఆదివారం లాల్‌కౌన్ జంక్షన్-కేఎస్సార్ బెంగళూరు ప్రత్యేక రైలు రాత్రి 8.20 గంటలకు పెద్దపల్లికి చేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుతుంది.

దన్‌బాద్-కోయంబత్తూరు స్పెషల్ ట్రైన్: ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.09 గంటలకు పెద్దపల్లికి చేరి, మరుసరి ఉదయం రేణిగుంటకు వెళ్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి వెళ్లవచ్చు.

షెడ్యూల్ ప్రకారం, నాందేడ్-ధర్మవరం ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి రాత్రి 10:05 గంటలకు పెద్దపల్లికి చేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతికి, సాయంత్రం 4 గంటలకు ధర్మవరం చేరుతుంది. ఆదివారం ఉదయం 5:30 గంటలకు ధర్మవరం నుంచి బయలుదేరి ఉదయం 10:25 గంటలకు తిరుపతికి, తరువాత సోమవారం మధ్యాహ్నం 12:05 గంటలకు పెద్దపల్లి చేరుతుంది.

కొత్తగా ప్రారంభించబోయే నాందేడ్-ధర్మవరం ప్రత్యేక రైలు ప్రారంభంలో నాందేడ్, నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, నంద్యాల, ఎర్రగుంట్ల మార్గంలో నడిచేది. ఆ మార్గంలో తగిన ఆదరణ లేకపోవడంతో నిజామాబాద్-పెద్దపల్లి మార్గంలో రైలును మళ్లించారు. 

ఈ ప్రత్యేక రైలు ద్వారా భక్తులు బాసరలోని జ్ఞాన సరస్వతి, వరంగల్ భద్రకాళి, విజయవాడ కనకదుర్గ, తిరుపతి, కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాలను నేరుగా సందర్శించగలుగుతారు. ఈ స్పెషల్ ట్రైన్ నిజామాబాద్-పెద్దపల్లి మార్గంలో నడవడం వల్ల కరీంనగర్ జిల్లా ప్రజలకు ప్రయాణం సులభతరం కాబోతుంది. ప్రయాణికులు కోరుకున్న విధంగా ఏపీ సంపర్క్ క్రాంతి, హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లకు పెద్దపల్లిలో ఆగితే మరింత సులభంగా ప్రయాణించవచ్చు.