Komatireddy Venkat Reddy: త్వరలో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. భవన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని సీఎం ముందు ఉంచుతామని చెప్పారు. ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా గురించి సంచలన వ్యాఖ్య‌లు చేశారు.  

Telangana Minister Komatireddy Venkat Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు (ఏపీ) ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది మాజీ ప్రధాని మన్మోహన్, సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఏపీకి మద్దతిస్తామని పార్లమెంటులో ఇచ్చిన హామీగా పేర్కొన్నారు. దీని కోసం త‌మ‌వంతు కృషి చేస్తామ‌ని కూడా చెప్పారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ అమలు కాలేదనీ, దీనిపై ప్రస్తుత ప్రధాని న‌రేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, త్వరలో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని సీఎం ముందు ఉంచుతామని చెప్పారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారుల కోసం భవన్ నిర్మిస్తామని, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ను కలుస్తానని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై చైర్మన్ తో చర్చిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. అంత‌కుముందు మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. వారసత్వ కట్టడంగా ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ), ఇతర పార్టీల పాత భవనాలను కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లిందని, త్వరలోనే శాసనమండలి చైర్మన్, ఇతర అధికారులు అక్కడికి వెళ్లి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన లలిత కళా తోరణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.