ఎవరికైనా పోలీసు పేరు వినపడగానే కొద్దిగా భయపడుతుంటారు. ఈ భయం చిన్నారుల్లో కాస్త ఎక్కువగానే ఉంటుంది.  అయితే... ఆ భయాన్ని పొగొట్టేందుకు పోలీసులు చిన్న ప్రయత్నం చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బాలమిత్ర పోలిస్ స్టేషన్ ని ఏర్పాటు చేశారు.

నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి స్థాపింిన బచ్ పన్ బచావో సహకారంతో మేడ్చల్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ని బాలమిత్ర పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోనే తొలి బాలమిత్ర పోలీస్ స్టేషన్ గా ఇది ఖ్యాతి దక్కించుకోనుంది. బాలల దినోత్సవం సందర్భంగా గురువారం ఈ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు. ఇందులో ఓ గదిని అచ్చంగా బాలమిత్ర స్టేషన్ కోసం కేటాయించారు.

బాలలు మెచ్చేలా పెయింటింగ్స్ తో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. పిల్లలతో ఎలా మెలగాలో అంశంపై ఇద్దరు కానిస్టేబుళ్లకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏదైనా కేసులో 18ఏళ్లలోపు చిన్నారులు బాధితులుగా ఉంటే వారిని ఇక్కడికి తీసుకువస్తారు. రకరకాల ఆటలు ఆడిస్తూ..తినుబండారాలు ఇచ్చి సదరు పిల్లల నుంచి సమాచారం సేకరిస్తారు.

మేక్ ఏ విష్ ద్వారా గతంలో ఒక రోజు పోలీస్ కమిషనర్ గా ముచ్చట తీర్చుకున్న చిన్నారి ఇషాన్ తో కలిసి  రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. కైలాస్ సత్యార్థి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (బీబీఏ) ప్రోత్సాహంతో ఈ పోలీ్‌సస్టేషన్‌ను మేడిపల్లిలో ఏర్పాటు చేశామని మహేశ్‌ భగవత్‌ తెలిపారు.