Asianet News TeluguAsianet News Telugu

పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలి.. రైతులకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విజ్ఞప్తి

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వర్షం, వడగాళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి ఓదార్చారు.

speaker pocharam srinivas reddy visits crop damage areas in banswada ksm
Author
First Published Apr 26, 2023, 4:39 PM IST

తెలంగాణ గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల  వర్షం, వడగళ్లతో పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వర్షం, వడగాళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి ఓదార్చారు. రైతులు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. గతంలో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని గుర్తుచేశారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతినడం బాధాకరమని పేర్కొన్నారు. సర్వే చేసి పంట నష్టంపై ప్రాథమిక అంచనాల వివరాలను ప్రభుత్వానికి పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ప్రకృతి విపత్తు‌ను తప్పించలేమని.. అయితే ప్రకృతి విపత్తు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చని అన్నారు. ప్రతి ఏడాది ప్రతి ఏడాది నవంబర్‌లో తుఫాన్లు, వేసవిలో వడగళ్ల వర్షంతో సాగు చేసిన పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని  చెప్పారు. 

యాసంగి వరి మడులను నవంబర్‌లో పోసుకుని ముందస్తుగా నాట్లు వేసుకుంటే మార్చి నెలలో కోతలు పూర్తయి పంట చేతికొస్తుందని అన్నారు. అలాగే వానాకాలం సీజన్ కోసం రోహిణి కార్తెలోనే నార్లు పోసుకుంటే అక్టోబర్ నెలలో కోతలు పూర్తవుతాయని అన్నారు. రైతులు కోరితే రోహిణి కార్తె‌లోనే నార్లు పోసుకోవడానికి వీలుగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసేలా చూస్తానని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios