ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ అగ్ని ప్రమాదంపై విచారణ: ఎస్‌సీఆర్ జీఎం అరుణ్
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టుగా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు.
హైదరాబాద్: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టుగా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు.ఫలక్ నుమా రైలులో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని జీఎం అరుణ్ కుమార్ జైన్ శుక్రవారంనాడు మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలక్ నుమా రైలులో అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదన్నారు. విచారణలో కారణాలు తెలుస్తాయని ఆయన తేల్చి చెప్పారు.
ఈ రైలులోని ప్రయాణీకులను ప్రత్యేక రైలు, ఆర్టీసీ బస్సుల ద్వారా సికింద్రాబాద్ కు తరలించినట్టుగా జీఎం అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. ట్రాక్ పునరుద్దరణ పనులు చర్యలు చేపడుతున్నామన్నారు.
also read:బాలాసోర్ తరహా ప్రమాదమంటూ బెదిరింపు లేఖ: పోలీసుల అదుపులో అనుమానితుడు
ఎన్‌డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటుందని జీఎం వివరించారు. బాలాసోర్ తరహాలో రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వచ్చిన బెదిరింపు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా జీఎం చెప్పారు. మరో వైపు ఈ ప్రమాదం కారణంగా రెండు రైళ్లను రద్దు చేసినట్టుగా రైల్వే శాఖ జీఎం ప్రకటించారు. మరికొన్ని రైళ్లను ఇతర రూట్లలో మళ్లించినట్టుగా తెలిపారు.అగ్ని ప్రమాదానికి గురై న బోగీలను మినహాయించి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలును సికింద్రాబాద్ కు తరలించామన్నారు.