రియల్ హీరో సోనూసూద్ కోసం ఓ అభిమాని సాహసం చేశాడు. 700కి.మీ.లు కాలినడకన పాదయాత్ర చేసి కలుసుకున్నాడు. 

కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన సోనూసూద్ కోసం కాలినడకన ప్రయాణం చేసి కలుసుకున్నాడు ఓ అభిమాని. వికారాబాద్ కు చెందిన సోను అభిమాని వెంకటేష్ చెప్పులు లేకుండా ఏడు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ముంబై చేరుకుని సోనూసూద్ ని కలిశారు. 

కాలినడకన తనను చూడడానికి వచ్చిన వెంకటేశ చూసి సోను చలించిపోయారు.  తన యోగ క్షేమాలు అడిగి ఫోటో దిగారు. వెంకటేష్ హైదరాబాద్ నుంచి ముంబై వరకు కాలినడకన నన్ను కలవడానికి వచ్చారు.  అతనిని చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది.  కానీ ఇంత ఇబ్బంది పడుతూ రావడాన్ని నేను  ఎంకరేజ్ చేయను అని సోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

వెంకటేష్ తో చాలాసేపు మాట్లాడిన సోనూసూద్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఎందుకిలా చేశావ్ అని అడిగితే.. మీరు దేవుడు కదా.. సార్.. అందుకే మిమ్మల్ని చూడడానికి ఇలా వచ్చానని చెప్పుకొచ్చాడు. దీంతో సోనూసూద్ ఇలాంటి పనులు చేయద్దని నేను మామూలు మనిషినని చెప్పుకొచ్చాడు. 

వెంకటేష్ చెబుతూ...సోనూ సూద్ ఫొటో చూసి దారి పొడవునా.. తాను ఎంటరైన ప్రతి రాష్ట్రంలోనూ తనకు అక్కడివారు ఆహారం పెట్టారని, పండ్లు, బిస్కెట్లు, చాయ్ లు ఇచ్చారని తెలిపాడు.

అయితే వెంకటేష్ ప్రయాణం గురించి తెలిసిన సోనూసూద్ అతని ఫోన్ నెంబర్ కనుక్కుని.. మార్గమధ్యంలోనే అతనితో చాలాసార్లు మాట్లాడారు. తన ప్రయత్నం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ వెంకటేష్ వినలేదు అని సోనూసూద్ తెలిపారు. దయచేసి ఇలాంటి పనులు చేయద్దని అభిమానులను కోరారు.