కన్న తండ్రిని కారుతో గుద్ది హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..

son killed father for money in bhuvanagiri
Highlights

రుస్తాపూర్‌ సమీపంలో వెనుక నుంచి తండ్రి వాహనాన్ని టాటా సుమోతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో జాలం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కని పెంచి.. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకే.. ఆయన పాలిట యుముడుగా మారాడు. ఆస్తి విషయంలో తండ్రితో గొడవపడి ఉన్మాదిగా మారాడు. దారుణంగా కారుతో గుద్ది హత్య చేశాడు. ఈ సంఘటన భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్‌ సమీపంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...మండల పరిధిలో గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని మర్రికుంటతండాకు చెందిన ధరావత్‌ జాలం (68)కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సుగుణకు బిక్షపతి.. రెండో భార్య లక్ష్మీకి నరేందర్‌ సంతానం. కొన్నేళ్లుగా కుటుంబంలో ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. బుధవారం జాలం, బిక్షపతి వేర్వేరు ద్విచక్రవాహనాలపై భువనగిరి ఏరియా ఆస్పత్రికి వెళ్లారు.

 మధ్యాహ్న సమయంలో జాలం ఒక్కడే బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా... రెండో భార్య కుమారుడు నరేందర్‌ టాటా సుమో వాహనంతో తండ్రిని వెంబడించాడు. రుస్తాపూర్‌ సమీపంలో వెనుక నుంచి తండ్రి వాహనాన్ని టాటా సుమోతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో జాలం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్తి వివాదం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుం దని పోలీసులు అనుమానిస్తున్నారు. నరేందర్‌కు నేర చరిత్ర ఉందని, 2014లో జాలం మొదటి భార్య రెండో కుమారుడు నర్సింహనాయక్‌ను తన బావమరిది సాయంతో హత్య చేశాడని గ్రామస్థులు చెప్పారు.

loader