వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్వహిస్తున్న మహా ప్రస్థాన పాదయాత్రలో కలకలం రేగింది. నల్గొండ జిల్లా తుంగతుర్తిలో షర్మిల కొందరు గ్రామస్తులతో మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. 

నల్గొండ జిల్లాలో (nalgonda district) జరుగుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. తుంగతుర్తిలోని నాగారంలో షర్మిల పాదయాత్రను కొందరు అడ్డుకున్నారు. షర్మిల మాట ముచ్చట కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ష‌ర్మిలను చూసిన కొందరు ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ‌, జై కేసీఆర్ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. అంత‌టితో ఆగ‌ని వారు.. ష‌ర్మిల బృందంపై చెప్పులు విసిరేశారు. ఈ ఊహించని ఘటనతో ష‌ర్మిల, ఆమె పార్టీ నేతలు షాక్ తిన్నారు.

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) మహాప్రస్థాన పాదయాత్ర (mahaa prasthana padayatra)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా (yadadari bhuvanagiri)లో షర్మిల యాత్ర కొనసాగుతుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS party) నాయకుడొకరు వీరంగం సృష్టించాడు. మాంసం కత్తితో వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తల బెదిరించడమే కాదు ఓ కార్యకర్తపై దాడికి పాల్పడ్డాడు.

భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామ శివారులోని చెన్నోలబావి వద్ద షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేసారు. సాయంత్రం కూడా అక్కడే ''షర్మిలక్కతో మా ముచ్చట'' కార్యక్రమం వుండటంతో పార్టీ కార్యకర్తలు అందుకోసం ఏర్పాటు చేస్తుండగా స్థానిక టీఆర్ఎస్ నాయకుడు వీరంగం సృష్టించాడు. అధికార పార్టీ వార్డ్ మెంబర్ అయిన తాళ్లపల్లి శ్రవణ్ మాంసం కత్తితో వైఎస్పార్ టిపి పాదయాత్ర బృందలోకి ప్రవేశించాడు. 

కార్యకర్తలను తరలించడానికి ఉపయోగిస్తున్న ఓ వాహనం టైర్ ను కోసేసాడు. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ కార్యకర్తపైకి దాడికి వెళ్ళాడు. కత్తితో తమపైకి వచ్చిన అధికార పార్టీ నాయకున్ని చూసి వైఎస్సార్ టిపి శ్రేణులు భయపడిపోయాయి. ఈ క్రమంలో గ్రామంలోని పిహెచ్సి వద్ద ప్లెక్సీ కడుతున్న వైఎస్సార్ టిపి కార్యకర్త శివరాజ్ శ్రవణ్ కంటపడ్డాడు. దీంతో ప్లెక్సీ కట్టడానికి ఉపయోగిస్తున్న తాడును శ్రవణ్ గట్టిగా లాగడంతో అదికాస్తా శివరాజ్ మెడకు చుట్టుకుని ఉరిలా బిగుసుకుపోయింది. బాధితుడు కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కాపాడి హాస్పిటల్ కు తరలించారు.