ఉప్పల్ లో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం

అతడు కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. సాప్ట్ వేర్ ఉద్యోగిగా లక్షలు సంపాదిస్తున్నాడు. వృత్తిపరంమైన జీవితం బాగానే వున్న పర్సనల్ జీవితంలో ఓడిపోయాడు. ఓ యువతిని ప్రేమను పొందలేక, ఆమె లేకుండా బ్రతకలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ కు చెందిన యతీష్ నగరంలో విప్రో కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు బుధవారం అర్థరాత్రి ఉప్పల్‌ హెచ్‌ఎండీఏ లేవుట్‌ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రేమ విఫలమే ఈ అఘాయిత్యానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలిలో లభించిన సూసైడ్ నోట్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యతీష్ మృతితో గ్రామంలో కూడా విషాదచాయలు అలుముకున్నాయి.