సారాంశం
వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో టెకీ మృతిచెందిన విషాదం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై చోటుచేసుకుంది.
హైదరాబాద్ : ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి సాప్ట్ వేర్ ఇంజనీర్ బలయ్యాడు. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన బస్ డ్రైవర్ టెకీ బైక్ ను ఢీకొట్టాడు. దీంతో అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులోని శామీర్ పేట ఆలియాబాద్ లో లక్ష్మీనారాయణ కుటుంబంలో కలిసి నివాసముంటున్నాడు. ఇతడి పెద్దకొడుకు మనోజ్ కుమార్(27) హైటెక్ సిటీలోని ఓ సాప్ట్ వేర్ కంపనీలో పనిచేస్తున్నాడు. అయితే నైట్ షిప్ట్ కావడంతో రాత్రి విధులు ముగించుకుని తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే అతడు ప్రమాదానికి గురయ్యాడు.
ట్యాంక్ బండ్ మీదుగా బైక్ పై వెళుతున్న మనోజ్ ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ముందున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి బైక్ వస్తున్న విషయాన్ని గమనించలేడు. దీంతో బైక్ ను బస్సు ఢీకొట్టి కిందపడిపోయిన మనోజ్ పైనుండి దూసుకెళ్లింది. దీంతో అతడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Read More అమెరికాలో నిజామాబాద్ యువకుడు మృతి.. ఎలాగంటే ?
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మనోజ్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. మృతుడి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. విధుల నిమిత్తం బయటకు వెళ్లిన కొడుకు ఇలా మృతదేహంగా తిరిగిరావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.