నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..
నెలసరి సెలవులపై ( menstrual leaves) రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Union Minister Smriti Irani) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) స్పందించారు. కేంద్ర మంత్రి ఇలా మాట్లాడటం బాధాకరమని అన్నారు.
నెలసరి సెలవుల విషయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదమయ్యాయి. తాజాగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో తాను నిరుత్సాహపడ్డానని, ఇలాంటి అజ్ఞానాన్ని చూడటం దారుణమని అన్నారు. రుతుస్రావం రోజులకు వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం మహిళల నిజమైన బాధను విస్మరించడమేనని అన్నారు. రుతుస్రావం ఒక ఎంపిక కాదని చెప్పారు.
ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో రుతుస్రావ పోరాటాలను తోసిపుచ్చడం బాధాకరం. ఒక మహిళగా, అజ్ఞానాన్ని చూడటం భయంకరంగా ఉంది, ఎందుకంటే మన పోరాటాలు, మా ప్రయాణాలు ఓదార్పు కాదు, ఇది ఒక సమానమైన ఆటకు అర్హమైనది, అది రాజీపడలేనిది.’’ అని పేర్కొన్నారు.
‘‘రుతుస్రావం అనేది ఒక ఎంపిక కాదు. అది బయోలాజికల్ రియాలిటీ. వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం అసంఖ్యాక మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరిస్తుంది. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల పట్ల సహానుభూతి లేకపోవడం, ప్రతిదానికీ మనం చేయాల్సిన పోరాటాన్ని చూడటం బాధాకరం. విధాన రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని సహానుభూతి, హేతుబద్ధతతో పూడ్చాల్సిన సమయం ఆసన్నమైంది.’’ అని ఆమె ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే ?
రాజ్యసభ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. రుతుస్రావం సమయంలో మహిళలు సెలవులు తీసుకునే అవకాశం ఉందా అని అన్నారు. యజమానులు రుతుక్రమ సెలవులు తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. వేతనంతో కూడిన రుతుస్రావ సెలవుల విధానాన్ని వ్యతిరేకించారు, ఇది శ్రామిక శక్తిలో మహిళలకు వివక్షకు దారితీస్తుందని అన్నారు.
‘‘రుతుచక్రం ఒక వైకల్యం కాదు. ఇది మహిళల జీవిత ప్రయాణంలో సహజమైన భాగం. ఇలా మహిళలకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం వల్ల పని ప్రదేశాల్లో వివక్షకు దారి తీస్తుంది. నెలసరి సెలువులు ఇవ్వాల్సి రావడం వల్ల కొన్ని సంస్థలు మహిళలను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవు. దీని వల్ల మహిళలకు ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది’’ అని చెప్పారు. అయితే ఇవి వివాదాస్పదంగా మారాయి.