శీతకాల విడిది కోసం తెలంగాణకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ములుగు జిల్లా రామప్పలో పర్యటించారు. అయితే రాష్ట్రపతి పర్యటన సమయంలో చిన్న అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. శీతకాల విడిది కోసం తెలంగాణకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ములుగు జిల్లా రామప్పలో పర్యటించారు. అయితే రాష్ట్రపతి పర్యటన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్ వద్ద షార్ట్ సర్క్యూట్‌తో చిన్నగా మంటలు చెలరేగి పొగ వెలువడింది. దీంతో వెంటనే అక్కున్న పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసి.. పొగను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం చేరుకుని.. సీతారాముల దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్‌లు స్వాగతం పలికారు. ఇక, భద్రాద్రి ఆలయానికి చేరుకన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి‌లు ఉన్నారు. 

అనంతరం భద్రాచలంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అలాగే కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకున్నారు. రామప్పకు చేరుకున్న రాష్ట్ర‌ప‌తికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌‌లు ఉన్నారు. రాష్ట్రప‌తికి ఆల‌య అధికారులు, అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. రామప్పలో రుద్రేశ్వర స్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.