మేడ్చెల్: తల్లి ప్రియుడి చేతిలో హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధాన్ని తట్టుకోలేక, కూతురు హత్యతో మనస్తాపానికి గురై ఆద్య తండ్రి కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరిలో రైలు కింద పడి ఆయన శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ఆద్యను ఆమె తల్లి అనూష ప్రియుడు కరుణాకర్ హత్య చేశాడు. అనూష మరో వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉండడం భరించలేక గొడవకు దిగి ఆద్యను హత్య చేశాడు. ఈ సంఘటన మేడ్చెల్ జిల్లాలోని ఘట్కేషర్ పోలీసు స్టేషన్ పరిధిలో జులై 2వ తేదీన చోటు చేసుకుంది. 

Also Read: చిన్నారి హత్య: ఇద్దరితో అఫైర్ ఆమె కూతురిని బలి తీసుకుంది

అనూష భర్త కల్యాణ్ భువనగిరిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి, భార్య అక్రమ సంబంధంపై ఆగ్రహంతో కల్యాణ్ కూతురు ఆద్యను హత్య చేశాడని మొదట భావించారు. 

అయితే, అనూష ఇద్దరు వ్యక్తులతో సంబంధం పెట్టుకుందని, ఆ ఇద్దరి మధ్య గొడవలో కరుణాకర్ అనే ప్రియుడు ఆద్యను చంపేశాడని పోలీసులు నిర్ధారించారు. కరుణాకర్ ఆద్య గొంతు కోసి హత్య చేశాడు. నాలుగు రోజుల క్రితం పోలీసులు కరుణాకర్ ను అరెస్టు చేశారు.