బాలికలు, యువతులే టార్గెట్... నమ్మించి, వలవేసి, కోరికలు తీర్చుకుని వదిలేస్తారు... 60 మంది బాధితులు... !!
జడ్చర్ల మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు, రాజాపూర్ కు చెందిన ఓ ప్రైవేటు టీచర్, మరో నలుగురు పలుకుబడి గల వ్యక్తులు బృందంగా ఏర్పడి కొంతకాలంగా ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం జడ్చర్ల కు చెందిన బాలికను ట్రాప్ చేసి, కారులో హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
జడ్చర్ల : అమ్మాయి అంటే ఆటవస్తువుగా మారుతున్న ధోరణి తీవ్ర ప్రమాదకర స్థితిని సూచిస్తోంది. ఇంట్లో భార్యా,పిల్లలు ఉండి.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఈ భావనకు మినహాయింపు కాకపోవడం... స్వయంగా వీరే అకృత్యాలకు పాల్పడడం.. హేయమైన విషయం. ఇలాంటి దారుణమైన అమానుష ఘటనలో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా.. ఓ పెద్ద ముఠా బయటపడింది.
అభం, శుభం తెలియని అమ్మాయిల్ని, యువతుల్ని మాయమాటలతో వంచించి, లైంగింకగా దాడి చేస్తున్న ఓ ముఠా గుట్టును మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. నిందితులంతా.. సమాజంలో పేరున్నవాళ్లు, మంచి హోదాలో ఉన్నవారే కావడం షాక్ కి గురిచేస్తోంది.. వివరాల్లోకి వెడితే..
బాలికలు, యువతులకు వల వేస్తారు.. వారిని నమ్మించి తమతో తీసుకెళ్తారు.. స్నేహితులతో కలిసి శారీరక వాంఛలు తీర్చుకుంటారు.. ఇదంతా చేస్తున్నది ఆకతాయిలు కాదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేట్ టీచర్, మరో నలుగురు వ్యక్తులు. ఓ బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జడ్చర్ల మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు, రాజాపూర్ కు చెందిన ఓ ప్రైవేటు టీచర్, మరో నలుగురు పలుకుబడి గల వ్యక్తులు బృందంగా ఏర్పడి కొంతకాలంగా ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల క్రితం జడ్చర్ల కు చెందిన బాలికను ట్రాప్ చేసి, కారులో హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
కార్లు మారుస్తూ వివిధ ప్రాంతాల్లో తిరిగారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయం తెలుసుకుని, ఆ ప్రబుద్ధులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. నాలుగు రోజుల తర్వాత బాలికను బస్సులో జడ్చర్ల తీసుకొచ్చి వదిలిపెట్టారు. బాలిక ఆచూకీ తెలుసుకునే క్రమంలో పోలీసులు పంచాయతీ కార్యదర్శి ఫోన్ డేటాను పరిశీలించారు. దీంతో వెలుగుచూసిన విషయాలు అందర్నీ షాక్ కు గురిచేశాయి.
బాలిక కిడ్నాపింగ్ లో అతని పాత్ర ఉందని గుర్తించి, తమదైన శైలిలో విచారించడంతో ఈ బృందం చేస్తున్న దారుణాలు బయటపడ్డాయి. వీరంతా సమాజంలో హోదా ఉన్న వ్యక్తులుగా మసులుకుంటూనే బాలికలు, యువతులకు వల వేస్తున్నారు. జడ్చర్ల తో పాటు వివిధ పట్టణాలు, గ్రామాలకు చెందిన యువతులు ఇప్పటికే సుమారు 60 మంది వీరి వలలో చిక్కుకున్నట్లు సమాచారం.
పంచాయతీ కార్యదర్శి భార్య ప్రస్తుతం గర్భవతి కావడం, పుట్టింటికి వెళ్లడంతో ఈ బృందం దాష్టీకాలు మరింత పెరిగినట్లు తెలుస్తుంది. పంచాయతీ కార్యదర్శి ఇంటినే అడ్డాగా చేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్నారని సమాచారం. మోసపోయిన అమ్మాయిల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా జరిగిన సంఘటనలను పోలీసుల దృష్టికి తీసుకు వస్తున్నట్లు తెలిసింది. ఈ బృందాన్ని కాపాడేందుకు ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.