Asianet News TeluguAsianet News Telugu

ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్, సరెండర్ పిటిషన్ దాఖలు

గ్రూప్ 2 అభ్యర్ధిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణమైనట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు . రెండ్రోజుల క్రితం శివరాంను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 
 

sivaram rathod surrendered in nampalli court in pravallika suicide case ksp
Author
First Published Oct 20, 2023, 4:40 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్రూప్ 2 అభ్యర్ధిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణమైనట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ మేరకు న్యాయస్థానంలో సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని కోర్ట్ అనుమతించింది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

కాగా.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈ నెల 13న రాత్రి హైదరాబాద్‌ అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్ 2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన తర్వాత ఈ ఘటన జరగడంతో విద్యార్ధి లోకం భగ్గుమంది. అటు విపక్షాలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అయితే పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారం వల్లే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని నిర్థారించారు. 

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శివరాం రాథోడ్ చేతిలో మోసపోయినట్లు మృతురాలు తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. దీనిని ప్రణయ్ పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు శివరాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో రెండ్రోజుల క్రితం శివరాంను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 

Also Read: కేటీఆర్‌ను కలిసిన ప్రవల్లిక కుటుంబ సభ్యులు .. సోదరుడికి ఉద్యోగం , న్యాయం చేస్తానన్న మంత్రి

మరోవైపు.. ప్రవల్లిక కుటుంబ సభ్యులు బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. కరీంనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రవల్లిక కుటుంబ సభ్యులు ఇవాళ తనను కలిశారని తెలిపారు. ఒకడు మా అమ్మాయిని వేధించి చంపాడని తన దృష్టికి తీసుకొచ్చారని.. న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చానని మంత్రి వెల్లడించారు. 

ప్రవల్లిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని .. ఆ కుటుంబానికి అండగా వుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే బాధితురాలి విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని.. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. రాహుల్, ప్రియాంక గాంధీలు వచ్చి మాయమాటలు చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారీకి న్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios