టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్  కేసులో  సిట్  బృందం  విచారణ  చేస్తుంది. ఐదు  రోజుల విచారణలో  సిట్  బృందం కీలక సమాచారాన్ని  సేకరించింది.   


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో సిట్ బృందం కీలక సమాచారం సేకరించింది. ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల బ్యాంకు ఖాతాలను సిట్ పరిశీలించింది. మరో వైపు గ్రూప్-1 పరీక్షలు రాసిన టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసింది. 

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఆరో రోజున సిట్ బృందం నిందితులను ప్రశ్నిస్తుంది. తొమ్మిది మంది నిందితులను ఇవాళ సిట్ బృందం విచారిస్తుంది. 

ఈ కేసులో అరెస్టైన నిందితులు రాజశేఖర్, ప్రవీణ్, రేణుక ఆమె భర్త ఢాక్యానాయక్ బ్యాంకు ఖాతాలను సిట్ బృందం పరిశీలించింది. ఇటీవల కాలంలో ఈ నిందితుల ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయా అనే కోణంలో కూడా సిట్ ఆరా తీస్తుంది. 

ఈ కేసులో అరెస్టైన రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా సురేష్ అనే వ్యక్తిని కూడా సిట్ అదుపులోకి తీసుకున్నారు. సురేష్ ను సిట్ అధికారులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. మరో వైపు గ్రూప్-1 పరీక్ష రాసిన 10 మంది టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్ష రాసిన వారిలో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏడుగురు ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

సిట్ విచారిస్తున్న సురేష్ కు గ్రూప్-1 పరీక్షలో 100 మార్కులు వచ్చినట్టుగా సమాచారం. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం విక్రయించి రేణుక డబ్బులు సంపాదించిందని సిట్ గుర్తించింది. నీలేష్, గోపాల్ లకు ప్రశ్నాపత్రాలు ఇచ్చి రూ. 14 లక్షలను రేణుక తీసుకుందని సిట్ గుర్తించింది. 

also read:టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్ .. శంకర్‌ లక్ష్మీని విచారణకు పిలిచిన సిట్

టీఎస్‌పీఎస్‌సీ కాన్పిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండ్ శంకరలక్ష్మిని సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. శంకరలక్ష్మి ఇచ్చిన సమాచారం మేరకు ప్రవీణ్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ల నుండి పెన్ డ్రైవ్ లను సిట్ బృందం సీజ్ చేసింది. ఈ పెన్ డ్రైవ్ లలో ప్రశ్నాపత్రాలు ఉన్నట్టుగా సిట్ బృందం గుర్తించిందని ఆ కథనం తెలిపింది..