అన్న మృతిని తట్టుకోలేక గుండెపోటుతో గంట వ్యవధిలోనే చెల్లి మృతి..
అనారోగ్యంతో అన్న మృతి చెందడాన్ని తట్టుకోలేక ఓ చెల్లి గుండె ఆగిపోయింది. గంట వ్యవధిలోనే గుండెపోటుతో మృతి చెందింది.

కరీంనగర్ : అన్న మరణ వార్తను విని తట్టుకోలేక గంట వ్యవధిలోనే ఓ చెల్లి గుండెపోటుతో కన్ను మూసింది. హృదయవిదారకమైన ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో వెలుగు చూసింది. అన్నాచెళ్లెళ్ల అనుబంధం గురించి మరోసారి లోకానికి చాటి చెప్పింది. అమ్మా నాన్న కలిసిన ఆప్యాయత రూపమైన అన్న మృతి చెందడాన్ని ఆ చెల్లి గుండె తట్టుకోలేకపోయింది.
దీంతో అన్న మరణించిన గంటలోపే గుండెపోటుకు గురై చెల్లి కూడా మృతి చెందింది దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే... కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి నిజామాబాద్ జిల్లా మోసరకు చెందిన వరవ పోసాలు(65) అనే వ్యక్తి పదేళ్ల క్రితం కుటుంబంతో సహా వలస వచ్చాడు.
ఇక్కడ పోసాలు కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే పోసాలు గత కొంతకాలంగా అనారోగ్యం బారిన పడ్డాడు. సెప్టెంబర్ 12వ తేదీన ఆరోగ్యం విషమించింది. దీంతో మృతి చెందాడు. పోసాలుకు.. పోషవ్వ (50)అని సోదరి ఉంది. అన్న మృతిని తట్టుకోలేక ఆమె గుండెలవిసేలా రోధించింది.
చిన్నప్పటినుంచి ఎప్పుడూ తోడు నీడగానే ఉన్న అన్న తీవ్ర అనారోగ్యంతో చనిపోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. చనిపోయినప్పటి నుంచి ఏడుస్తూనే ఓ గంట వ్యవధిలోనే మరణించింది. ఓకే కుటుంబంలోని ఇద్దరు గంట వ్యవధిలోనే మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.