సినిమాలతో కేవలం వినోదాన్ని అందించడమే కాదు జీవితాలను కూడా మార్చవచ్చని మరోసారి నిరూపించింది బలగం. ఈ సినిమా దూరమైన ఒకే తల్లి బిడ్డలను తిరిగి ఒకటిచేస్తోంది.  

వరంగల్ : ఒకే తల్లి కడుపున పుట్టినవారు ప్రేమానురాగాలు పంచుకుంటూ కలిసిమెలిసి వుండాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన సినిమా 'బలగం'. ఈ సినిమాలో తెలంగాణ పల్లె సంస్కృతినీ, కుటుంబ బంధాలను చక్కగా తెరకెక్కించారు. తమ బిడ్డలు దిక్కుకొకరుగా విడిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో డైరెక్టర్ వేణు చక్కగా చూపించాడు. ఇక సినిమా చివర్లో అన్నదమ్ములు, చెల్లి కలిసే సన్నివేశం అందరిచేతా కన్నీరు పెట్టిస్తుంది. బలగం సినిమా చూసి ఏళ్ళుగా మాటలులేని కుటుంబాలు కూడా కలిసిపోతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలోనూ ఇలాగే పదిహేను ఏళ్లుగా మాటలే లేని అక్కాతమ్ముడిని కలిపింది బలగం. 

వివరాల్లోకి వెళితే... వరంగల్ పట్టణానికి సమీపంలోని వనపర్తి గ్రామానికి చెందిన అనుముల లింగారెడ్డి, లక్ష్మీ అక్కా తమ్ముళ్లు. అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డితో లక్ష్మీ పెళ్లి కావడంతో పుట్టి పెరిగిన ఊరే అత్తవారి ఊరయ్యింది. కళ్ల ముందే కూతురు వుంటుందని లక్ష్మీ తల్లిదండ్రులు గ్రామానికి చెందిన వ్యక్తితోనే పెళ్లిచేసారు. 

అయితే పదిహేనేళ్ళ క్రితం లింగారెడ్డి కూతురు పెళ్లిలో ఆ ఇంటి ఆడపడుచు లక్ష్మీకి అవమానం జరిగింది. పెళ్లిలో తనను పట్టించుకోవడం లేదని... కనీసం నూతన దంపతులతో ఫోటో కూడా తీయకపోవడంతో లక్ష్మి అలిగింది. దీంతో ఆ పెళ్లిలో భోజనం కూడా చేయకుండానే వెళ్లిపోయింది. ఇలా చిన్న కారణంతో అక్కాతమ్ముడి కుటుంబాల మధ్య పెరిగిన దూరం గత పదిహేనేళ్లుగా కొనసాగుతోంది.

Read More బలగం సినిమా కూడా ఈ కసాయిని కరిగించలేదా..! తమ్ముడికి నిప్పంటించి నడిరోడ్డుపై చంపిన అన్న

ఒకే ఊళ్లో వుంటున్నా అక్కాతమ్ముడి మధ్య మాటలులేవు. గతేడాది అక్క భర్త వీరారెడ్డి చనిపోయినా అనారోగ్యంతో హాస్పిటల్లో వున్న లింగారెడ్డి వెళ్లలేకపోయాడు. ఇలా అక్కాతమ్ముడి కుటుంబాల మధ్య రోజురోజుకు దూరం పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు. 

అయితే తెలంగాణ పల్లెల్లో ప్రస్తుత పరిస్థితులను చూపిస్తూ కుటుంబమంతా కలిసిచూసే సినిమా బలగం గ్రామాగ్రామాన ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. వనపర్తి గ్రామంలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాలో అన్నదమ్ములు, చెల్లి దూరమైతే ఆ తండ్రి ఎంత నరకం అనుభవించాడో... చివరకు చనిపోయాక కూడా కుటుంబమంతా కలిసుండాలని కోరుకోవడం అక్కాతమ్ముడు లింగారెడ్డి, లక్ష్మిల గుండెలకు తాకాయి. దీంతో ఇద్దరూ పంతాలు వదిలేసి కలిసిపోయారు. 

గ్రామంలోని తోబుట్టువు ఇంటికి వెళ్ళాడు లింగారెడ్డి. ఏళ్లుగా మాట్లాడకుండా దూరంగా వున్న చెల్లిని ప్రేమగా పలకరించాడు. సోదరి కూడా అన్నను హత్తుకుని కన్నీరు పెట్టుకుంది. ఇలా బలగం సినిమా అక్కాచెల్లిని కలిపి రెండు కుటుంబాల్లో ఆనందాలు నింపింది.