రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జవాన్ పబ్బాల అనిల్ జమ్మూలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. జవాన్ అనిల్ అంత్యక్రియలు ఈరోజు సైనిక లాంఛనాలతో ఆయన స్వగ్రామం మల్కాపూర్‌లో నిర్వహించారు.
జమ్మూలోని తూర్పు కిషత్‌వార్ జిల్లాలో గురువారం ఆర్మీ హెచ్‌ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జవాన్ పబ్బాల అనిల్ మృతిచెందిన సంగతి తెలిసిందే. జవాన్ అనిల్ భౌతికకాయానికి ఈరోజు ఆయన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. వివరాలు.. అనిల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిల్ ఆర్మీ ఏవియేషన్ సీఎఫ్‌ఎన్ విభాగంలో సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నారు. అయితే అనిల్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనిల్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
అనిల్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో శుక్రవారం హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ రాకేష్ మనోచాతో పాటు పలువురు అధికారులు అనిల్‌కు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అనిల్ స్వగ్రామానికి తరలించారు.
ఈరోజు ఉదయం అనిల్ భౌతికకాయానికి మంత్రి గంగుల కమలాకర్, టీ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, టీఎస్ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ అనురాగ్ జయంతి, పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ తదితరులు నివాళులర్పించారు. అనిల్ అంతిమయాత్రలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతిమ యాత్ర సాగుతున్న మార్గంలో జాతీయ జెండాలు పట్టుకుని అనిల్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోలు మధ్య సైనిక లాంఛనాలతో జవాన్ అనిల్ అంత్యక్రియలను నిర్వహించారు.
