తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రంగారెడ్డి జిల్లాలో సింటెక్స్ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
తెలంగాణలో సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ నెలకొల్పనుంది. ఇక్కడ సింటెక్స్ కంపెనీ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్ తదితర ఉత్పత్తులను తయారు చేయనుంది.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వెల్ఫెన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా మంత్రి చెప్పారు. దీని వల్ల 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ నెలకొల్పనుంది.
ఇక్కడ సింటెక్స్ కంపెనీ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్ తదితర ఉత్పత్తులను తయారు చేయనుంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి సెప్టెంబర్ 28న కేటీఆర్, వెల్‌స్పన్ కంపెనీ ఛైర్మన్ బీకే గోయెంకా భూమి పూజ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడులు పెడుతున్నందుకు సింటెక్స్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని అద్భుతమైన మౌలిక వసతుల కారణంగా పెట్టుబడులు తరలి వస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అంతకుముందు లోక్‌సభ వేదికగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా పోస్టు చేస్తూ.. 'బిజెపి ఎంపి ఇలాంటి అసభ్యకరంగా, దారుణంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. అంతకంటే దిగ్భ్రాంతికరం, అవమానకరమైన విషయం ఏమిటంటే.. స్పీకర్ లోక్‌సభలో ఈ అసంబద్ధతను అనుమతించడం. పార్లమెంటులోనే ఇలా జరిగితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. బీజేపీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.'అని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కేటీఆర్ కోరారు.
ఈ ఘటనను ఎమ్మెల్సీ కవిత కూడా తీవ్రంగా ఖండించారు. ట్వీట్ చేస్తూ.. 'మన దేశం అత్యున్నత సభలో ఎంపీ డానిష్ అలీ జీ పట్ల ఎంపీ రమేష్ బిధూరి అమర్యాదకరమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరం. మన ప్రజాస్వామ్య ప్రసంగంలో అలాంటి ప్రవర్తనకు చోటు లేదు. గౌరవ స్పీకర్ ఓం బిర్లా జీ.. తక్షణమే బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను.'అని పేర్కొన్నారు