సింగరేణి కాలనీలో బాలికపై రేప్, హత్య: రాజుతో కలిసి మద్యం సేవించిన మిత్రుడు
హైదరాబాదు సైదాబాదులోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఆమె హత్య కేసులో పోలీసులు నిందితుడు రాజు మిత్రుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాజు ఎటు వెళ్లాడనేది తనకు తెలియదని అతను చెప్పనట్లు సమాచారం.
హైదరాబాద్: సైదాబాదులోని సింగరేణి కాలనీలో పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన మిత్రుడితో రాజు కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. దాని ఆధారంగా రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన తర్వాత శవాన్ని ఇంటిలోనే పడేసి తాళం వేసి రాజు పారిపోయాడు. ఆ తర్వాత అతను తన మిత్రుడితో కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. దాంతోనే రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: సైదాబాద్ అత్యాచార ఘటన.. స్నేహితుడి సహకారం, ఇంకా దొరకని నిందితుడు..!
మద్యం సేవించిన తర్వాత రాజు ఎటు వెళ్లాడనే విషయం తనకు తెలియదని అతని మిత్రుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. రాజు గతంలో ఓ చోరీకి కూడా పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని సైదాబాదులో గల సింగరేణి కాలనీలో పాపపై రాజు అత్యాచారం చేసి, ఆమెను చంపేసిన విషయం తెలిసిందే.
రాజు ప్రవర్తన నచ్చక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. నల్లగొండ జిల్లాకు చెందిన రాజు సింగరేణి కాలనీనికి వచ్చి బాలిక ఉంటున్న పక్కింట్లోనే ఉంటున్నాడు. అతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాలికపై కన్నేసిన రాజు చాక్లెట్లు ఆశ చూపి ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా, నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని, తమకు దొరకలేదని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన తర్వాత స్థానికులు ఆందోళనకు దిగారు.
బాలిక కుటుంబ సభ్యులను సినీ నటుడు మంచు మనోజ్ మంగళవారంనాడు పరామర్శించారు. సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.