ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఉద్దండులను కాదని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు అనూహ్యంగా మంత్రి వర్గంలో స్ధానాన్ని దక్కించుకున్నారు.

ఈ జిల్లా నుంచి సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాంలు మంత్రి పదవిని ఆశించినప్పటికీ, అప్పలరాజును అదృష్టం వరించింది. మంత్రి వర్గ విస్తరణలో తన పేరు ఖరారు కావడంపై అప్పలరాజు స్పందించారు.

తనకు మంత్రి పదవి దక్కుతుందని ఊహించలేదని చెప్పారు. తనపై నమ్మకం వుంచి పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పదవితో తనపై బాధ్యత మరింత పెరిగిందని అప్పలరాజు చెప్పారు.

Also Read:ఏపీ కేబినెట్ విస్తరణ: రేపు రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణరావుల రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి పదవులను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు‌తో భర్తీ చేయనున్నారు.

వీరిద్దరితో బుధవారం మధ్యాహ్నం 1 గంటకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరోవైపు మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. ప్రమాణ స్వీకారానికి ముందు జగన్ ఓ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.

వాస్తవానికి జోగి రమేశ్, పొన్నాడ సతీశ్‌లకు అవకాశం ఇస్తారని భావించినప్పటికీ.. సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు‌లను తీసుకోవాలని ముఖ్యమంత్రి భావించారు. కొత్త మంత్రుల్లో వేణుకు ఆర్ అండ్ బీ, అప్పలరాజుకు మత్స్య శాఖను అప్పగిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి