సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు ఇళ్లు, ఆఫీస్ తో పాటు బంధువుల ఇళ్లపై పోలీసులు దాడితో అటు సిద్దిపేట, ఇటు దుబ్బాకలో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.  దాడుల విషయం తెలిసి సిద్దిపేటకు వెళ్లడానికి ప్రయత్నించిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కరీంనగర్‌లోని తన కార్యాలయానికి చేరుకున్న సంజయ్‌ బయటి నుంచి తాళం వేసుకుని నిర్బంధ దీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా సిద్దిపేట పోలీసులు మరీ ముఖ్యంగా సిపి తనపట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ చేయికూడా చేసుకున్నాడని అన్నారు. కాబట్టి కమీషనర్ పై చర్యలు తీసుకునేవరకు దీక్షను కొనసాగిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా దుబ్బాకకు వెళ్లేందుకు ఎన్నికల కమీషన్ నుండి తనకు అనుమతి వుందన్నారు. దాన్ని చూపించినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. తనపై జరిగిన దాడిపై పార్లమెంట్ లో ఫిర్యాదు చేస్తానని... సిద్దిపేట పోలీస్ కమీషనర్ ను బదిలీ చేసేవరకు తన పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

read more  బండి సంజయ్ అరెస్ట్... పోలీసులపై పవన్ కల్యాణ్ ఫైర్

 దుబ్బాక అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు సమీప బంధువుల ఇళ్లలో సోమవారం నాడు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొడవ జరిగింది. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. పోలీసులు స్వాదీనం చేసుకొన్న నగదును బీజేపీ కార్యకర్తలు ఎత్తుకెళ్లారు.

ఈ విషయం తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని పోలీసులు సిద్దిపేటకు రాకుండా అడ్డుకొన్నారు. వారిని మార్గమధ్యలోనే అడ్డుకొని కరీంనగర్ కు పోలీసులు తరలిస్తున్నారు.

దుబ్బాకలో ఎన్నికలు జరిగితే సిద్దిపేటలో పోలీసులు ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. పోలీసులు సోదాల విషయం తెలుసుకొన్న రఘునందన్ రావు సిద్దిపేటకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు.