హైదరాబాద్ నగరంలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు హేమంత్ అనే యువకుడు బలి అయ్యాడు. అతను ప్రేమించిన యువతి అవంతి.. కుటుంబసభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. కాగా.. ఈ హేమంత్ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. అయితే.. తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించలేదని హేమంత్ భార్య అవంతి ఆరోపించడం గమనార్హం.

కాగా.. హేమంత్ హత్యపై గచ్చిబౌలి సీఐ మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం 4 గంటలకు హేమంత్‌, అవంతిని తీసుకెళ్లారని వెల్లడించారు. హేమంత్‌ తండ్రి 100కు డయల్‌ చేశారన్నారు. పెట్రోలింగ్‌ వాహనం వెళ్లేసరికి అక్కడ అవంతి లేదన్నారు. తమకు సాయంత్రం 6:30 గంటలకు అవంతి ఫిర్యాదు చేసిందని గచ్చిబౌలి సీఐ తెలిపారు. అవంతి ఫిర్యాదు చేసేసరికే హేమంత్‌ను చంపేశారన్నారు. ఈ హత్య కేసులో పోలీసుల అలసత్వం ఏమీ లేదన్నారు. హత్యకు అవంతి తండ్రి ధర్మారెడ్డి, బంధువులదే బాధ్యత అన్నారు. ఒకరిద్దరు మాత్రమే బయటివారున్నారని గచ్చిబౌలి సీఐ తెలిపారు.