తెలంగాణలో షాపులు, రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణలో షాపులు, మాల్స్, రెస్టారెంట్లు ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉండవచ్చు. వారంలో ఏడు రోజులూ సేవలు అందించవచ్చు. ఇందుకు సంబంధించి లేబర్ డిపార్ట్‌మెంట్ నిబంధనలను సవరించింది.
హైదరాబాద్: తెలంగాణలో వ్యాపారులకు ఉపకరించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో దుకాణాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు 24 గంటలు ఓపెన్ ఉంచుకోవచ్చని, వారంలో ఏడు రోజులూ ఇవి వినియోగదారులకు అందుబాటులో ఉంచుకోవచ్చని వివరించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. ఈ నెల 4వ తేదీనే ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి. కానీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఇందుకు సంబంధించి కార్మిక శాఖ విడుదల చేసిన జీవోలో ఇలా ఉన్నది. రాష్ట్రంలో వారంలో ఏడు రోజులు 24 గంటలు ఓపెన్ చేసుకోవడానికి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ యాక్ట్ 1988 యాక్ట్ కింద పేర్కొన్న షాపులు, సంస్థలకు సెక్షన్ 7 (షాపులు తెరవడం, మూసుకునే గంటల) నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిందని వివరించింది. ఈ జీవోను లేబర్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఐ రాణి కుముదిని విడుదల చేశారు.
అయితే, ఇలా 24 గంటలు తెరిచే ఉంచుకునే షాపులకు కొన్ని షరతలనూ ప్రభుత్వం పేర్కొంది. వారి ఉద్యోగులకు ఐడీ కార్డులు ఇవ్వాలి. వీక్ ఆఫ్‌లు ఇవ్వాలి. వారానికి పని గంటలను నిర్దేశించాలి. షిఫ్ట్‌కు మించి పని చేసే గంటలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వేళ ప్రభుత్వం సూచించిన సెలవు దినాల్లో పనికి వస్తే అందుకు సంబంధించిన వేతనాలు ఆ కార్మికులకు అందించాలి. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. నైటి షిఫ్టులో పని చేయడానికి వారి నుంచి ముందుగానే అంగీకారాన్ని తీసుకోవాలి. వారి రాకపోకలకూ ఏర్పాట్లు చేయాలి అని లేబర్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన జీవో పేర్కొంది.
Also Read: ఎంపీ బండి సంజయ్ ఇంట్లో ‘బలగం’ సీన్ రిపీట్.. ఏం జరిగింది?
ఈ షాపులు కచ్చితమైన రికార్డులు మెయింటెయిన్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఆదాయపన్నునూ సకాలంలో చెల్లించాలని తెలిపింది. 24 గంటలూ తెరిచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాలి అని వివరించింది. పోలీసు యాక్ట్, రూల్స్‌ను అంగీకరించినవారికే ఆమోదం లభిస్తుందని తెలిపింది.