పెద్దపల్లి జిల్లా ధర్మారం లో వెలుగు చూసిన నకిలీ వేలిముద్రల స్కాం లో కీలక విషయాలు బైటికి వస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం సిమ్ కార్డుల కోసమే నిందితుడు వీటిని తయారు చేసినట్లు పోలీసులు అనుమానించారు. అయితే సిమ్ కార్డుల విక్రయానికే కాదు నిందితుడు రేషన్ డీలర్లతో కుమ్మకై ప్రభుత్వం పేదలకు అందిచే బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు పోలీసులు గుర్తించారు.

పెద్దపల్లి జిల్లాలో నకిలీ వేలిముద్రలు తయారుచేస్తున్న ధనలక్ష్మి ఇంటర్ నెట్ సెంటర్ నిర్వహకుడు సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేసిర విషయం తెలిసిందే. అతడి వద్ద దాదాపు 6 వేల నకిలీ వేలిముద్రలతో పాటు వేలిముద్రల తయారీ యంత్రం, కంప్యూటర్, ఓ సెల్ ఫోన్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటిని అతడు సెల్ ఫోన్లలో వాడే సిమ్ లను విక్రయించడానికి వాడుతున్నట్లు మొదట పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు విచారించగా అసలు నిజాలు బైటపెట్టాడు.

అయితే నిందితుడు ఈ నకిలీ వేలిముద్రలతో పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని కూడా స్వాహా చేసినట్లు తెలిసింది.రేషన్ డీలర్లతో కుమ్మక్కై సంతోష్ ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై నిందితుడిని విచారించగా అసలు నిజాలు చెప్పాడు.

రేషన్‌ డీలర్ల సహాయంతో  వందల క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని కరీంనగర్‌కు తరలించినట్లు విచారణ సందర్భంగా సంతోష్ పోలీసులకు తెలిపాడు.దీంతో పోలీసులు నలుగురు డీలర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

ఇంకా ఈ వేలిముద్రలను నిందితుడు ఎక్కడైనా ఉపయోగించాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకోసం క్రైం బ్రాంచ్, క్లూస్ట టీం పోలీసులు నిందితుడిని అతడి స్వగ్రామం ధర్మారానికి తీసుకువెళ్లి అతడి ఇంట్లో, ఇంటర్ నెట్ సెంటర్లో మరోసారి తనిఖీలు చేశారు.