వరంగల్ జిల్లాలోని గొర్రెకుంట బావిలో బయపటడిన 9 మృత దేహాల ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. కాగా... ఈ హత్య  కేసుల పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ రిపోర్టులో వాళ్లంతా బతికుండగానే బావిలోపడేసినట్లు తేలింది. ఎందుకంటే వాళ్లంతా నీటిలో పడే చనిపోవడం గమనార్హం.

అయితే... విషమిచ్చిన తర్వాత బావిలో పడేశారా లేదా.. ఏదైనా మత్తు మందు ఇచ్చారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్సే కీలకంకానున్నాయి. కాల్ డేటా ఆధారంగా వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మక్సూద్ కూతురు బూస్రాకు ఉన్న అక్రమ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలతో సీపీ సమావేశమయ్యారు. 

తొమ్మిది మంది మృతి మిస్టరీని చేధించేందుకు పోలీసులు అన్ని దారుల్లో విచారణ తీవ్రతరం చేశారు. కేసులో మహ్మద్ మక్సూద్ ఆలంకు సన్నిహితుడైన డ్రైవర్ షకీల్ అహ్మద్, మక్సూర్ కూతురు బుస్రా ఖాతూన్‌తో‌‌ వివాహేతర సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఘటనలో షకీల్ సెల్‌ఫోన్‌పై దృష్టి సారించిన పోలీసులు కాల్ డేటాను సేకరిస్తున్నారు.  బుస్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానం ఉన్న మిద్దెపాకయాకూబ్‌ను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. 

బీహార్‌కే చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మందిలో ఏడుగురి సెల్‌ఫోన్ల ఆచూకీపై టెన్షన్ నెలకొంది. మృతుల ఫోన్ నంబర్లను పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను వెలికి తీసిన తర్వాత సెల్‌ఫోన్ల కోసం బావి నుంచి నీరంతా తోడినా ఆధారాలు లభించలేదు. మిస్టరీగా మారిన ఈ ఘటనలో సెల్ ఫోన్లే  కీలకంకానున్నాయి. ఆ దిశగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.