తెలంగాణలో ఒకవైపు బలపడేందుకు బిజెపి కసరత్తు చేస్తుంటే  మరోవైపు వలస వచ్చిన నేతలంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి బిజెపిని వీడేందుకు డిసైడ్ అయ్యారు. ఆయన రేపు బిజెపికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం వెలువడింది.

కొమ్మూరి ప్రతాపరెడ్డి వరంగల్ జిల్లాలోని చేర్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత నియోజకవర్గాల విభజనలో చేర్యాల ఎగిరిపోయింది. ప్రస్తుతం జనగామ నియోజకవర్గంలో కొమ్మూరి యాక్టివిటీ చేస్తున్నారు. ఆయన బిజెపిలో గత కొంతకాలంగా క్రియాశీలకంగా పనిచేయడంలేదు.

తాజాగా తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో కొమ్మూరి భేటీ అయ్యారు. పలు అంశాలపై హరీష్ కు, కొమ్మూరికి మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. అయితే జనగామ టిఆర్ఎస్ టికెట్ ఇస్తారా? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయనకు జనగామ టికెట్ ఇస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిస్థితి ఏంటన్నది కూడా తేలాల్చి ఉంది.

టికెట్ విషయంలో కొమ్మూరికి హామీ ఇస్తారా? లేదంటే టిఆర్ఎస్ లో చేరిన తర్వాత చూస్తారా అన్నది ఇంకా తేలలేదు. జనగామ ముత్తిరెడ్డి మీద తీవ్రమైన భూఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. గతంలో జిల్లా కలెక్టర్ గా ఉన్న దేవసేన స్వయంగా ఆరోపణలు గుప్పించారు. అయితే ఆ కారణంగానే ఆమెపై బదిలీ వేటు కూడా పడింది.

దేవసేన పై బదిలీ వేటు పడగానే.. ముత్తిరెడ్డికి తిరుగులేదన్న వాతావరణం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ముత్తిరెడ్డికే టికెట్ అన్నట్లు ప్రచారం ఊపందుకుంది. కానీ ఇప్పుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి తెరమీదకు రావడంతో జనగామ పాలిటిక్స్ మరోసారి హాట్ హాట్ గా మారిపోయాయి.  

మళ్లీ పాత గూటికే చేరేనా?

కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ తరుపున చేర్యాల నియోజకవర్గంలో గెలుపొందారు. తర్వాత కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టిఆర్ఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలగా నిలిచారు. తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న సాన్నిహత్యం కారణంగా అయన మరణానంతరం ఏర్పాటైన వైసిపిలో కొమ్మూరి చేరిపోయారు. వైసిపిలో కీలక పదవి దక్కింది. సిఇసి సభ్యుడిగా పనిచేశారు. అయితే తెలంగాణ ఏర్పాటవుతున్న క్రమంలో సమైక్య నినాదం ఎత్తుకుని వైసిపి తెలంగాణ నుంచి చాప చుట్టేసింది. దీంతో తదనంతర కాలంలో కొమ్మూరి బిజెపిలో చేరారు. ఇప్పుడు మళ్ళీ ఆయన పాత గూటికి చేరే అవకాశాలున్నట్లు చర్చ సాగుతోంది. మొత్తానికి కొమ్మూరి జనగామ అభ్యర్థిగా నిలుస్తాడా లేదా అన్నది కొద్దిరోజులపాటు సస్పెన్ష్ గానే ఉంటుందని చెబుతున్నారు.