తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్ (Kantekar Madhu Mohan) టీఆర్‌ఎస్ (TRS) పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం బీజేపీలో చేరారు.

తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్ (Kantekar Madhu Mohan) టీఆర్‌ఎస్ (TRS) పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన కాంటేకర్ మధుమోహన్.. తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు.మధుమోహన్ తిరిగి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని తరుణ్ చుగ్ అన్నారు. మధుమోహన్ రక్తంలోనే బీజేపీ, ఆరెస్సెస్ ఉందన్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పారు. 

తుక్కగూడ మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీలో యాక్టివ్‌గా ఉన్న మధుమోహన్.. ఎన్నికల్లో టికెట్ ‌లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.తుక్కగూడ మున్సిపాలిటీలో (tukkuguda municipality) మొత్తం 15 స్థానాలకు గానూ బీజేపీ 9, టీఆర్‌ఎస్ 5 స్థానాల్లో విజయం సాధించింది. రెండో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మధుమోహన్ విజయం సాధించారు. బీజేపీకి మెజారిటీ వచ్చినప్పటికీ తగిన సంఖ్యలో ఎక్స్ అఫీషియో ఓట్ల మద్దతు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి కాంటేకర్ మధుమోహన్ కీలకంగా మారారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో ఉన్న తుక్కగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి పావులు కదిపారు. 

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నాయిని నర్సింహారెడ్డి, కేశవరావు, సబితా ఇంద్రారెడ్డి, కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, ఎగేమల్లేశం ఓట్లను కూడగట్టుకుని మధుమోహన్‌ను తుక్కగూడ చైర్మన్‌ పదవిని అప్పగించారు.. ఆ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ ఖాతాలో వేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక అప్పట్లో చర్చనీయాంశంగా మరిన సంగతి తెలిసిందే. 

అయితే మధుమోహన్ పార్టీలో చేరిన తర్వాత కొన్నాళ్లు బాగానే సాగిపోయింది. అయితే కొంత కాలంగా పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం, టీఆర్‌ఎస్ శ్రేణులు నుంచి సహకారం లేకపోవడం, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని భావిస్తున్న మధుమోహన్ పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ను వీడిన మధుమోహన్.. బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ వెళ్లి తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే తుక్కగూడ మున్సిపాలిటీలో బీజేపీకి తగిన బలం ఉండటంతో మధుమోహన్ చైర్మన్‌ పదవిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.