2014 ఎన్నికల ముందు వైసీపీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పుట్ట మధు కుట్ర చేసి నాగరాజును రెచ్చగొట్టి అతని మరణానికి కారణమయ్యాడని తెలిపారు.


మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మంథని అభ్యర్థి పుట్ట మధుకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ కార్యకర్త నాగరాజు మృతికి మధునే కారణమంటూ మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీశ్ డిమాండ్ చేశారు. పుట్ట మధు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మంథని టికెట్‌ సాధించేందుకు... 2013లో జరిగిన కేసీఆర్‌ సభలో నాగరాజును ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆయన ఆరోపించారు.

 నాగరాజుది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారుల రక్షణ వేదిక కన్వీనర్‌ నవీన్‌ యాదవ్‌, న్యాయవాది జయ వింధ్యాలతో కలిసి ఆయన మాట్లాడారు. పుట్ట మధు అవినీతి, అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

అనంతరం నాగరాజు మృతి కేసులో ప్రధాన నిందితుడు రమణా రెడ్డి మాట్లాడారు. నాగరాజు తనకు సన్నిహిత మిత్రుడని చెప్పారు. 2014 ఎన్నికల ముందు వైసీపీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పుట్ట మధు కుట్ర చేసి నాగరాజును రెచ్చగొట్టి అతని మరణానికి కారణమయ్యాడని తెలిపారు. కేసీఆర్‌ సభ సందర్భంగా నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ కేసులో తనను ఇరికించి ఏ 1గా చేర్చారని చెప్పారు. 

ఆర్టీఐ ద్వారా పుట్ట మధు అక్రమాలను వెలుగులోకి తెచ్చానని సతీశ్‌ తెలిపారు. దాంతో వికలాండుడైన తనకు పింఛన్‌ రాకుండా చేశాడని, ఇంటి ప్రహరీ గోడను కూల్చివేయించాడని, ఉప సర్పంచ్‌ పదవి నుంచి తనను తొలగింపజేశాడని సతీశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. నాగరాజు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎస్సైగా ఉన్న అధికారే ప్రస్తుతం మంథని సీఐగా ఉన్నారని, పుట్ట మధుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.