టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. పాలకుర్తి టికెట్ ను ఎర్రెబెల్లికి కేటాయించారు. అయితే.. ముందు నుంచీ ఆ టికెట్ తనకి దక్కుతుందని తక్కెళ్లపల్లి  రవీందర్ ఆశించారు. కానీ ఆ టికెట్ ని ఎర్రబెల్లికి కేటాయించారు.

కాగా.. తాజాగా ఈ విషయంలో ఎర్రబెల్లికి షాక్ తగిలింది. ఆయన వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆరుగురు వ్యక్తులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఎర్రబెల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తక్కెళ్ల పల్లికి టికెట్ ఇవ్వాలని లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ డిమాండ్ చేశారు. ట్యాంకు ఎక్కారని తెలుసుకున్న గ్రామానికి చెందిన ఎర్రబెల్లి వర్గీయులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

ఆ సమయంలో ఎర్రబెల్లి వర్గీయులకు, తక్కెళ్లపల్లి వర్గీయులకు చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. విజయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాటర్ ట్యాంక్ ఎక్కిన వారిని సముదాయించారు. దీంతో.. వారు కిందకి దిగి వచ్చారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీసులు స్టేషన్ కి తీసుకువెళ్లారు.