హైదరాబాద్: టీవీ9 కొనుగోలు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు శివాజీ ఎట్టకేలకు అజ్ఞాతవాసం వీడారు. తాను ఎక్కడికి పారిపోలేదని ఆ అవసరం కూడా లేదంటూ వీడియో విడుదల చేశారు. 

ఇదోక చిన్న కేసు అని దాని గురించి తాను భయపడి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. వడదెబ్బ వల్ల తాను బయటకు రాలేకపోతున్నానని మరో నాలుగు రోజులు కూడా రాలేనని తెగించి చెప్పేశారు శివాజీ. ఇకపోతే ఇలాంటి కేసులు వంద కాదు వెయ్యి వేసుకోవాలంటూ సవాల్ విసిరారు. టీవీ9 విషయంలో గత కొద్దిరోజులుగా తనపై చేస్తున్న ఆరోపణలు దురదృష్టకరమన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ళుగా తనపై కక్ష గట్టిందని సినీనటుడు శివాజీ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను చేసిన విమర్శలను తట్టుకోలేకే తనపై ఇలాంటి వేధింపులకు పాల్పడుతోందని శివాజీ ఆరోపించారు. 2018లో టీవీ9 షేర్లకు సంబంధించి 2018లోనే అగ్రిమెంట్ జరిగిందని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.

"

చిన్న సివిల్ సెటిల్మెంట్ అశాన్ని పెద్దదిగా చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కౌశిక్ అనే వ్యక్తి ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే తన ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహిస్తారా అంటూ మండిపడ్డారు. 

తన ఇంట్లో నానా హంగామా చేశారని చివరకు ఏమి పట్టుకెళ్లారని ప్రశ్నించారు. తాను సెటిలర్ ను అని, స్థానికంగా బలంలేదనే కారణంతో హైదరాబాద్ పోలీసులు నానా హంగామా చేశారని విమర్శించారు. గత రెండేళ్లుగా తాను చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో తనను ఎలాగైనా జైల్లో పెట్టాలని కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం అంతా జరిగిందన్నారు.