హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునివ్వగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ బంద్ కు మద్దతిచ్చింది. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. 

ఇలా హైదరాబాద్ లో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా బంద్ కు మద్దతుగా అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నిరసనకు దిగారు. అయితే పోలీసులు కూడా వారికి సహకరిస్తూ బారీకేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నిలిపివేశారు. దీంతో తీవ్ర  ఇబ్బందులకు గురయిన శేరిలింగంపల్లి వాసులు ఇదేంటని ఎమ్మెల్యే గాంధీని నిలదీశారు. ఇలా ఇబ్బందులకు గురిచేయడం తగదని...అయినా ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు ఇప్పుడే కనిపించాయా? అంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను గట్టిగా ప్రశ్నించింది. 

read more  రైతుల పాలిట గొడ్డలిపెట్టు నూతన వ్యవసాయ చట్టాలు : శ్రీనివాస్ గౌడ్
 
ఇలా తమ ఎమ్మెల్యేను నిలదీస్తున్న స్థానికులతో టీఆర్ఎస్ నాయకులు కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేను ప్రశ్నించడానికి వచ్చిన స్థానికుల్లో ఓ వ్యక్తి పై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో మరింత గందరగోళం ఏర్పడింది.

పరిస్థితి చేయిదాటేలా వుండటంతో పోలీసులు రంగంలోకి దిగి ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలకు, అటు స్థానికులకు సర్దిచెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. స్థానికులు అక్కడి నుండి వెళ్లిపోవడంతో టీఆర్ఎస్ నాయకులు నిరసనను కొనసాగించారు.