Asianet News TeluguAsianet News Telugu

రూ. 40 కోట్ల భూ వివాదం: షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్టు

హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల రూ.40 కోట్ల భూమి వ్యవహారంలో షేక్ పేట ఎమ్మార్వో సుజాత పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో సుజాతను తెలంగాణ ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Shaikpet MRO Sujatha arrested by Telangana ACB
Author
Hyderabad, First Published Jun 8, 2020, 7:09 PM IST

హైదరాబాద్: హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని భూ వ్యవహారంలో షేక్ పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు సాయంత్రం ఆమెను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భూవివాదంలో సుజాత పాత్ర ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తన నివాసంలో ఏసీబీకి చిక్కిన రూ.30 లక్షలకు తగిన లెక్కలు కూడా చూపించలేకపోయారని సమాచారం. వైద్య పరీక్షల తర్వాత ఆమెను న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తారు. 

హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని భూవివాదానికి సంబంధించి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం నుంచి షేక్ పేట ఎమ్మార్వో సుజాతను తమ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆమె నివాసంలో దొరికిన రూ.30 లక్షలపై సుజాత సరైన సమాధానం ఇవ్వడం లేదని సమాచారం.

సోదాల సమయంలో ఏసీబీ అధికారులకు సుజాత నివాసంలో రూ.30 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ డబ్బులు ఎక్కడివనే విషయంపై సుజాత స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆమె స్పష్టత ఇవ్వకపోతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఆమెపై నమోదు చేసే అవకాశం ఉంది.  

బంజారాహిల్స్ లోని రూ.40 కోట్ల విలువ చేసే బంజారాహిల్స్ భూమి వివాదంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డి ఎసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఎసీబీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో పోలీసు అధఘికారి రవీంద్రనాయక్ ను కూడా ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

గత మూడు రోజులుగా సుజాతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సుజాత భర్త వాంగ్మూలాన్ని, వీఆర్వో వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసు, రెవెన్యూ అధికారులతో పాటు ఇంకా ఎవరి పాత్రనైనా ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios