సిద్దిపేట: చదువుకోవాలన్న లక్ష్యంతో అందర్నీ విడిచిపెట్టి హాస్టల్ లో ఉంటున్నారు..కన్నవారిని జన్మనిచ్చిన ఊరిని బంధువులను ఆప్తులను వదిలి ఉన్నత లక్ష్యాల కోసం హాస్టల్ లో చేరారు. కడుపునపెట్టుకుని చూడాల్సిన అటెండర్ కాలనాగులా కాటెయ్యాలని చూస్తున్నాడు. చిన్నారులను లైంగికంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఘటన గజ్వేల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వెలుగులోకి వచ్చింది. 

ఈ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ స్వామి చిన్నారులప పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఈనెల 17న ఆరోతరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ పట్టించుకోకపోలేదు. గతంలో కూడా అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడని...విద్యార్థినుల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పలువురు విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు.

 ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు మెురపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు అంతా ఏకమై ప్రిన్సిపాల్ ను నిలదీయ్యాలని అప్పటికీ పట్టించుకోకపోతే తల్లిదండ్రులకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ అటెండర్ ను విధుల నుంచి తొలగించారు.  

మరోవైపు బీజేపీ నేతలు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. కీచక అటెండర్ స్వామిని అరెస్ట్ చెయ్యాలని ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.