హైదరాబాద్: హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న అనిల్ నగర శివారులోని ఓ రిసార్ట్ లో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణలో ఎస్సై రాసలీలల బాగోతం నిజమేనని తేలడంతో రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు సిపి ప్రకటించారు.  

విధినిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీస్ అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పోలీస్‌ స్టేషన్‌ పరువు తీస్తున్నారని సిపి మండిపడ్డారు. జవహర్ నగర్ ఎస్సై రాసలీలల నేపథ్యంలో ఇతర పోలీసులకు కూడా సిపి సీరియస్ గా హెచ్చరించినట్లు సమాచారం. పోలీస్ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పరువు తీయొద్దని సిపి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ శివారు కీసరలోని సైలెంట్ వరల్డ్ రిసార్ట్ లో ఓ మహిళతో వుండగా ఎస్సైని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సై  రాసలీలపై పక్కా సమాచారంతో రిసార్ట్ పై దాడిచేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

read more  వ్యాపారుల్ని దొంగలుగా మార్చిన లాక్‌డౌన్.. హైదరాబాద్‌లో ఇరానీ గ్యాంగ్ హల్‌చల్

ఇదిలావుంటే ఇటీవల దొంగ బాబాల చేతిలో అత్యాచారానికి గురయిన మహిళకు న్యాయం చేయాల్సింది పోయి పంచాయితీ చేసిన ఇద్దరు పోలీసులు సస్పెండయ్యారు. తనపై జరిగిన అత్యాచారంపై రామన్న పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితురాలు రాచకొండ సీపీని ఆశ్రయించింది. సీపీ విచారణలో పోలీసుల, బాబాల బాగోతం వెలుగుచూసింది. కేసులో నిర్లక్ష్యం వహించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు రావడంతో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ లను సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం మునిపంపులలో పూజల పేరుతో బురిడీ బాబాలు ఓ మహిళ మీద అత్యాచారానికి పాల్పడ్డారు. దంపతుల గొడవల్లో బురిడీ బాబాలు తలదూర్చారు. పూజల పేరుతో ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దాన్నంతా వీడియో తీశారు. 

ఆ తరువాత ఈ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ భారీగా నగదు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీడియోలు డిలీట్ చేయించి బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు వాపస్ ఇప్పించారు. మిగతా డబ్బు ఇవ్వకపోవడంతో రాచకొండ సీపీని బాధితురాలు ఆశ్రయించింది. దీంతో సీఐ,ఎ స్సై సస్పెండయ్యారు.