మధ్యభారతంపై ఆవరించి ఉన్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ ప్రజలు చలికి తట్టుకోలేక వణికిపోతున్నారు. చలికాలంలోనూ లేనంత స్థాయిలో చల్లగాలులు వీస్తుండటంతో హైదరాబాదీలు ఇబ్బంది పడుతున్నారు.

దోణి ప్రభావంతో శనివారం నుంచి రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. దీంతో మిరప, మొక్కజోన్న, మామిడి వంటి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు చల్లటి గాలులతో జనం ఇళ్లు దాటి బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో వైరల్ జ్వరాలు పంజా విసురుతున్నాయి. స్వైన్ కేసులతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.