వేధింపుల కేసులో జైలు ఊసలు లెక్కబెడుతున్న గజల్ శ్రీనివాస్ కు షాకింగ్ న్యూస్. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. గజల్ శ్రినివాస్ కేసులో బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు పోలీసుల తీరును కూడా కోర్టు ఎండగట్టింది.

గజల్ శ్రీనివాస్ కేసులో ఎ2 నిందితురాలు పార్వతి పరారీలో ఉందని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇప్పుడే గజల్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని పోలీసు తరుపు న్యాయవాది వెల్లడించారు. అయితే ఈ విషయంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న వ్యక్తి పరారీలో ఉందని ఎలా చెబుతారని ప్రశ్నించింది.

మరో సందరర్భంలోనూ పోలీసులకు మందలింపులు తప్పలేదు. గజల్ శ్రీనివాస్ తాలూకు వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం చెప్పకుండానే ఎందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారని ప్రశ్నించింది న్యాయస్థానం.

గజల్ శ్రీనివాస్ కు బెయిల్ వస్తుందేమోనని ఆశతో ఉన్న గజల్ కు నాంపల్లి కోర్టులో షాకింగ్ తీర్పు అందింది. అయితే కుట్రపూరితంగా గజల్ శ్రీనివాస్ ను కేసులో ఇరికించారని, తక్షణమే ఆయనకు బెయిల్ ఇవ్వాలని గజల్ శ్రీనివాస్ తరుపు న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది.