Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 17: చరిత్ర మరవని రోజున తెలంగాణలో పొలిటికల్ గేమ్.. హీటెక్కిన‌ రాజకీయాలు

September 17: ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ ల మ‌ధ్య కొన‌సాగుతున్న రాజ‌కీయ పోటీకి సెప్టెంబ‌ర్ 17 కీల‌క అంశంగా మారింది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలు వేరువేరు పేర్ల‌తో భారీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. 

September 17: Political game in Telangana.. Heated politics-Hyderabad
Author
First Published Sep 16, 2022, 2:09 PM IST

Hyderabad: తెలంగాణ చ‌రిత్రలో సెప్టెంబ‌ర్ 17కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. దీనిని ఒక్క‌క్క‌రు ఒక్కో పేరుతో.. ఒక్కో అంశాన్ని పేర్కొంటూ గుర్తుచేసుకుంటారు. ఇప్పుడే ఇదే అంశాన్ని రాజ‌కీయ పార్టీలు హాట్ టాపిక్ గా మార్చాయి. ఈ విష‌యంలో ఎవ‌రికి వారు పై చేయి సాధించే విధంగా ముందుకు క‌దులుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ ల మ‌ధ్య కొన‌సాగుతున్న రాజ‌కీయ పోటీకి సెప్టెంబ‌ర్ 17 కీల‌క అంశంగా మారింది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలు వేరువేరు పేర్ల‌తో భారీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే, దీని వెనుక పొలిటిక‌ల్ మైలేజీ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సెప్టెంబ‌ర్ 17ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తున్న‌ది. అందుకే పోటీప‌డి మ‌రీ సెప్టెంబ‌ర్ 17న వివిధ కార్య‌క్ర‌మాలు జ‌ర‌ప‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. 

హైదరాబాద్ విమోచన దినోత్సవం vs జాతీయ సమైక్యత దినోత్సవం

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని కాషాయ పార్టీల నేతలు దీనిని ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం’గా పేర్కొంటుండగా, టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా పేర్కొంటోంది.  అలాగే, కాంగ్రెస్ సైతం పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే తెలంగాణ మంత్రివర్గం 2022 సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా “తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు” ప్రారంభ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. అధికారిక ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 16న ప్రభుత్వం భారీ ర్యాలీలను నిర్వహించనుంది. ఇందులో విద్యార్థులు, యువకులు, పురుషులు, మహిళలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రధాన కార్యాలయాల్లో పాల్గొంటారు.

సెప్టెంబర్ 17న పబ్లిక్ గార్డెన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించ‌నున్నారు..

సెప్టెంబర్ 17న రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేస్తారని ఆ ప్రకటనలో తెలిపారు. గుస్సాడి గోండు లంబాడీలు, ఇతర కళారూపాలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలతో పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్డు నుంచి అంబేద్కర్‌ విగ్రహం మీదుగా ఎన్టీఆర్‌ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తారు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో కవులు, కళాకారులతో పాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

బీజేపీ స‌ర్కారు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో... 

కేంద్రంలోని బీజేపీ సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ విమోచ‌న దినంగా జ‌ర‌ప‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో బీజేపీ అగ్ర‌నేత‌లు పాలుపంచుకోనున్నార‌ని స‌మాచారం. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల నాయ‌కులు కూడా ఇందులో పాలుపంచుకోనున్నారు. గురువారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' ఉత్సవాలను చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి దేవాలయం నుండి మహిళా బైక్ ర్యాలీతో ప్రారంభించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప‌క్కా ప్లాన్ తో ముందుకు క‌దులుతున్న‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  ఎందుకంటే వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాష్ట్రానికి.. ప్ర‌జ‌ల‌తో ముడిప‌డి ఉన్న ప్ర‌తిఅంశాన్ని బీజేపీ ఉప‌యోగించుకోవాలని ప్ర‌ణాళిక‌లు చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఒక లేఖలో, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వారిని తెలంగాణలో 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఆహ్వానించారు. 

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న కాంగ్రెస్.. 

75వ హైదరాబాద్‌ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 17న త్రివర్ణ పతాకంతోపాటు ప్రత్యేక రాష్ట్ర పతాకాన్ని ఎగురవేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సోమవారం తెలిపారు. తెలంగాణ జెండా రాష్ట్ర గర్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో త్రివర్ణ పతాకంతో పాటు తెలంగాణ జెండాను రెపరెపలాడిస్తామని పేర్కొన్నారు. తెలంగాణా ప్రజలందరినీ ప్రతిబింబించేలా కొత్త "తెలంగాణ తల్లి" విగ్ర‌మాన్ని కాంగ్రెస్ ఆవిష్క‌రించ‌నుంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల‌కు ధీటుగా సెప్టెంబ‌ర్ 17 వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి సిద్ద‌మైంది కాంగ్రెస్.  మొత్తంగా రాష్ట్రంలో పొలిటిక‌ల్ మైలేజ్ కోసం ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్ని ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది.

Follow Us:
Download App:
  • android
  • ios