ఓటు నమోదుకు ఈ నెల 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్
ఎన్నికల అక్రమాలపై సీ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.
హైదరాబాద్:ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సోమవారం నాడు రాత్రి హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఎన్నికల అక్రమాలపై సీ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.ఓటు వేయడానికి వయోవృద్ధులకు సహాయం చేయడానికి వాలంటీర్లను పెడుతున్నామన్నారు. దివ్యాంగుల వంటి ప్రత్యేక ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తామని వికాస్ రాజ్ చెప్పారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని వికాస్ రాజు వివరించారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1950 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు.ఓటు హక్కు కోసం ఈ నెల 31వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాకారి తెలిపారు.
నామినేషన్ పత్రాల్లోని అన్ని కాలమ్స్ ను అభ్యర్థులు భర్తీ చేయాలనిఆయన కోరారు. లేకపోతే నామినేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు.బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల ఫోటో, పేర్లు కూడ ఉంటాయని ఆయన చెప్పారు.నగదు తీసుకెళ్లే సమయంలో తగిన పత్రాలను సమర్పించాలని సీఈఓ సూచించారు. ప్రతి రోజూ రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని సీఈఓ చెప్పారు. ప్రభుత్వ వెబ్ సైట్లలో రాజకీయ నేతల ఫోటోలను తొలగించాలని వికాస్ రాజ్ కోరారు.అడ్వర్టైజ్ మెంట్ల కోసం ముందుగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజకీయ పార్టీల నేతలకు సూచించారు.