ఖమ్మం: చిన్న విషయానికి జూనియర్ విద్యార్ధిపై సీనియర్లు తీవ్రంగా పిడిగుద్దులు గుద్ది చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన ఖమ్మం  జిల్లాలో  చోటు చేసుకొంది.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని మధర్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో జూనియర్ విద్యార్ధిపై సీనియర్లు దాడి చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన శివ గణేష్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

పెద్దపల్లి జిల్లాకు చెందిన శివ గణేష్ ఫేస్‌బుక్ ద్వారా తన స్నేహితుడికి ఓ మేసేజ్  పంపాడు.  అయితే పొరపాటున ఆ మేసేజ్  తన స్నేహితుడికి కాకుండా అదే కాలేజీలో చదివే సీనియర్  విద్యార్ధికి చేరింది.

దీంతో సీనియర్ విద్యార్ధి ఆఫ్రిది తన స్నేహితులతో కలిసి వచ్చి శివగణేష్‌పై దాడికి దిగారు. శివగణేష్‌పై  సీనియర్లు దాడికి పాల్పడే దృశ్యాలను కొందరు విద్యార్థులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయమై కాలేజీ యాజమాన్యం కేసు కాకుండా జాగ్రత్తలు తీసుకొంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.